Musk vs Zuckerberg: దిగ్గజాల పోరుకు.. ఇటలీ వేదిక!

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) మధ్య పోరుకు ఇటలీ వేదిక కానుంది.

Published : 12 Aug 2023 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక దిగ్గజ సంస్థల అధినేతలైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) మధ్య కేజ్‌ ఫైట్ జరగనుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతన్న విషయం తెలిసిందే. ఇందుకు వేదిక కూడా ఖారరైనట్లు తెలుస్తోంది. ఈ పోరును ఇటలీలో (Italy) నిర్వహించనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ స్వయంగా వెల్లడించారు. ఈ పోరు, వేదికకు సంబంధించి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడినట్లు వివరించారు.

‘ఈ పోరును నేను, జూకర్‌బర్గ్‌ ఫౌండేషన్లు నిర్వహిస్తాయి (యూఎఫ్‌సీ కాదు). ఎక్స్‌ (మునుపటి ట్విటర్‌)తోపాటు మెటాలలో ఈ కార్యక్రమం లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగుతుంది. కొత్తదనంగా ఏమీ ఉండదు. కెమెరాలో మొత్తం పురాతన రోమ్‌ మాత్రమే ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో పాటు ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చలు జరిపాను. ఓ పురాతన వేదికకు వారు అంగీకరించారు. ఇటలీ గతాన్ని, వర్తమానాన్ని గౌరవించేలా ప్రతీది ఉంటుంది’ అని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. అయితే, ఏతేదీన ఈ పోరు ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు. ఆగస్టు 26న జరిపేందుకు సిద్ధమని జూకర్‌ బర్గ్‌ ప్రకటించినప్పటికీ.. మస్క్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

నాకు శస్త్ర చికిత్స జరిగే అవకాశం ఉంది: ఎలాన్‌ మస్క్‌

తమ మధ్య జరిగే పోరు ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళతాయని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. రాజకీయాలు, కృత్రిమ మేధ( AI)కు సంబంధించి పలు విషయాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తూ.. మస్క్‌, జుకర్‌బర్గ్‌ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి మాటలు తారస్థాయికి చేరాయి. ఎక్స్‌ (Twitter)కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్‌ అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీనిపై విమర్శలు చేసిన మస్క్‌.. ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను డిజైన్‌ చేశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని