PM Modi: ప్రధాని మోదీకి మేక్రాన్‌ కానుకలు.. ఏం బహూకరించారంటే?

ఫ్రాన్స్(France) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi)కి ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron) కొన్ని ప్రత్యేక కానుకలు బహూకరించారు.

Published : 14 Jul 2023 21:51 IST

పారిస్‌: ఫ్రాన్స్ (France) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi)కి ఆ దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. వీటితో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron) ప్రధానికి కొన్ని ప్రత్యేక కానుకలు బహూకరించారు. వీటిలో ప్రముఖ ఫ్రెంచ్‌ రచనలు, 11వ శతాబ్దంనాటి చార్లెమాగ్నే చెస్‌ బోర్డ్ (Chess Board) నమూనాతోపాటు 1916లో తీసిన ఫొటో కాపీ ఉన్నాయి. 1913-1927 మధ్య ఫ్రెంచ్‌ రయిత మార్సెల్‌ ప్రౌస్ట్ ‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ టైమ్‌’ పేరుతో చేసిన రచనలతోపాటు, 20వ శతాబ్దంలో అతి ముఖ్యమైనవిగా పరిగణించే ఫ్రెంచ్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను ప్రధాని మోదీకి మేక్రాన్‌  బహూకరించారు.

అలాగే, 1916 జులై 14న చాంప్స్ ఎలీసెస్‌ (Champs-Elysees) మిలటరీ పరేడ్‌ సందర్భంగా సిక్కు అధికారికి అటుగా వెళ్తున్న ఫ్రెంచ్‌ వ్యక్తి పుష్పగుచ్ఛం ఇస్తున్నప్పుడు మెయిరుస్సే (Meurisse) వార్తా ఏజెన్సీకి చెందిన ఫొటో రిపోర్టర్‌ తీసిన ఫొటో నమూనాను బహూకరించారు. ఈ ఫొటో ఒరిజినల్‌ కాపీని ఫ్రాన్స్‌లోని జాతీయ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రస్తుతం బాస్టీల్‌ డే పరేడ్‌ (Bastille Day Parade)లో భారత సైన్యం పాల్గొంటున్న సందర్భంగా..1913-14 మధ్య కాలంలో యూరప్‌ తరపును పోరాడిన భారతీయ సైన్యానికి నివాళిగా, భారత్-ఫ్రాన్స్‌ల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యానికి గుర్తుగా దీన్ని బహూకరించినట్లు చెప్పారు.

ప్రధాని మోదీకి బహూకరించిన చార్లెమాగ్నే చెస్‌ బోర్డ్ నమూనాలో 16 పావులను ప్రత్యేక ఆకృతిలో డిజైన్ చేసి ఉంటాయి. 11వ శతాబ్దంలో చదరంగం ఆటలో రాజులు ఉపయోగించిన చదరంగం పావుల స్ఫూర్తితో 3డీ ప్రింటింగ్‌ సాయంతో తయారు చేసి, పైభాగాన్ని కంచుతో ప్రత్యేకంగా అలంకరించారు. భారత్-యూరప్‌ల మధ్య వాణిజ్యానికి గుర్తుగా దీన్ని బహూకరించినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని