PM Modi: ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ పరేడ్‌.. గౌరవ అతిథిగా పాల్గొన్న మోదీ

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆ దేశ  జాతీయ దినోత్సవ బాస్టీల్‌ డే పరేడ్‌ (Bastille Day Parade)లో పాల్గొన్నారు.

Updated : 14 Jul 2023 14:20 IST

పారిస్‌: ఫ్రాన్స్‌ (France) జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాస్టీల్‌ డే పరేడ్‌ (Bastille Day Parade) శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఈ వేడుకల్లో గౌరవ అతిధిగా పాల్గొన్నారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి ఈ పరేడ్‌ను వీక్షించారు. 

ఐరోపాలోనే అతిపెద్ద కవాతుగా బాస్టీల్‌ డే పరేడ్‌ పేరొందింది. ఇందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటున్నాయి. భారత సాయుధ దళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందం.. ఫ్రాన్స్‌ దళాలతో కలిసి ఈ పరేడ్‌లో పాల్గొంది. దీంతో పాటు భారత్‌కు చెందిన నాలుగు రఫేల్‌ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్‌మాస్టర్లు పారిస్ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించాయి.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ గురువారం పారిస్‌ చేరుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ఆయన.. అనంతరం అధ్యక్షుడు మేక్రాన్‌ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మేక్రాన్‌.. ప్రధాని మోదీని ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ అవార్డుతో సత్కరించారు.

ఈ పరేడ్‌ అనంతరం.. మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గనున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్‌ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. భారత నౌకాదళం కోసం 26 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని