పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన.. దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
అరుదైన వ్యాధితో బాధపడుతూ దుబాయ్‌లో తుదిశ్వాస
కార్గిల్ యుద్ధానికి కుట్రదారు ఆయనే..
కరాచీలో జరగనున్న అంత్యక్రియలు
ఇస్లామాబాద్, దుబాయ్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన.. దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. భారత్, పాక్‌ల మధ్య 1999 నాటి కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారణం ముషారఫే. కేసుల భయంతో స్వదేశాన్ని వీడిన ఆయన.. 2016 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో తలదాచుకున్నారు. ముషారఫ్ అమైలాయిడోసిస్ బారిన పడ్డారని ఆయన పార్టీ ‘ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్)’ 2018లో వెల్లడించింది. ఇదో ప్రాణాంతక వ్యాధి. అమైలాయిడ్ అనే అసాధారణ ప్రొటీన్ శరీరమంతటా అవయవాలు, కణజాలాల్లో పోగుపడటం వల్ల వస్తుంది. దాన్ని నయం చేసే సమర్థ చికిత్సలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. వ్యాధి తీవ్రమవడంతో ముషారఫ్ గత ఏడాది జూన్‌లో మూడు వారాలపాటు ఆసుపత్రిపాలయ్యారు. ఆయన అంత్యక్రియలు పాక్‌లోని కరాచీ నగరంలో జరగనున్నాయి. ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించనున్నారు.
దిల్లీలో జననం
అవిభాజ్య భారత్‌లోని దిల్లీలో ముషారఫ్ 1943లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. దేశ విభజన తర్వాత 1947లో ఆయన కుటుంబం పాక్‌కు వలస వెళ్లింది. 1949 నుంచి 1956 వరకు తండ్రి ఉద్యోగరీత్యా ముషారఫ్ తుర్కియేలో ఉన్నారు. 1961లో పాక్ మిలిటరీ అకాడమీలో చేరిన ముషారఫ్.. 1964లో శతఘ్నిదళంలో ప్రవేశించారు. 1965 నాటి భారత్-పాక్ యుద్ధంలో యువ అధికారిగా పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య 1971లో జరిగిన యుద్ధంలో కమాండో బెటాలియన్‌లో కంపెనీ కమాండర్‌గా పోరాడారు.
కార్గిల్‌లోకి సైన్యాన్ని చొప్పించి..
కార్గిల్ యుద్ధం సూత్రధారి ముషారఫే. 1999 ఫిబ్రవరిలో అప్పటి భారత ప్రధానమంత్రి వాజ్‌పేయీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లాహోర్‌లో చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ కొన్ని నెలల్లోనే ముషారఫ్ కారణంగా కార్గిల్ యుద్ధం ముంచుకొచ్చింది. ఆయనకు భారత్‌పై విపరీతమైన ద్వేషం. సరిహద్దుల్లోని సియాచిన్ ప్రాంతంలో మన దేశం పట్టును సహించలేకపోయారు. అందుకే కార్గిల్‌లో చొరబడేందుకు 1988-89 మధ్య అప్పటి పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో ముందు ప్రతిపాదనలు ఉంచారు. యుద్ధ పరిణామాలపై భయంతో భుట్టో అందుకు అంగీకరించలేదు. కానీ ముషారఫ్ తన ఆలోచనను విరమించుకోలేదు. 1999 మార్చి నుంచి మే మధ్య కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా పాక్ సైన్యాన్ని చొప్పించారు. ఆ సంగతిని భారత్ గుర్తించడంతో రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తింది. సైన్యం చొరబాట్ల గురించిగానీ, యుద్ధం గురించిగానీ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఏమాత్రం తెలియకపోవడం గమనార్హం. కార్గిల్ యుద్ధ సమయంలో షరీఫ్‌కు వాజ్‌పేయీ ఫోన్ చేస్తే.. యుద్ధం గురించి తనకేమీ తెలియదని ఆయన అన్నట్లు చెబుతుంటారు. కార్గిల్ యుద్ధంతో ముషారఫ్, షరీఫ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వెంటనే ముషారఫ్‌ను సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని షరీఫ్ భావించారు. ఆ విషయం తెలియగానే ఆగ్రహానికి గురైన ముషారఫ్.. ఆయన సర్కారును పడగొట్టారు. షరీఫ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. తర్వాత అరెస్టు చేశారు కూడా.
వాజ్‌పేయీతో చర్చలు విఫలం
ఆగ్రా సదస్సు కోసం 2001లో ముషారఫ్ భారత్‌కు వచ్చారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయీతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఫలితంగా కశ్మీర్ వివాదం కొలిక్కి వచ్చినట్లే కనిపించింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం ఖాయమనిపించింది. అయితే చివరికి నిరాశ తప్పలేదు. కశ్మీర్ విషయంలో ఒక ఒప్పందానికి ఇరు దేశాలు నాడు రాలేకపోయాయి. 2004 జనవరిలో ఇస్లామాబాద్‌లో సార్క్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కూడా వాజ్‌పేయీ, ముషారఫ్ చర్చలు జరిపారు. 2005లో భారత్-పాక్ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు దేశాధ్యక్ష హోదాలో ముషారఫ్ భారత్‌కు వచ్చారు. పదవి నుంచి దిగిపోయాక 2009లో మన దేశానికి వచ్చి ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నారు.
షరీఫ్ సర్కారును కూలదోసి..
సైన్యంలో అంచెలంచెలుగా జనరల్ ర్యాంకుకు ఎదిగిన ముషారఫ్‌ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా 1998 అక్టోబరులో అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నియమించారు. 1999 ఏప్రిల్‌లో జాయింట్ చీఫ్స్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముషారఫ్ కారణంగా ఆ ఏడాది కార్గిల్ యుద్ధం ముంచుకొచ్చింది. అక్కడ చేతులు కాల్చుకున్నప్పటికీ.. ఆయన పంథా మార్చుకోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన షరీఫ్ సర్కారును సైనిక తిరుగుబాటుతో అదే ఏడాది కూలదోశారు. దేశ పాలనాపగ్గాలు చేపట్టారు. పాక్‌కు ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్’గా తనను తాను నియమించుకున్నారు. 2001లో దేశాధ్యక్ష పీఠమెక్కారు. మరుసటి ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి.. అధ్యక్ష పదవిని పదిలం చేసుకున్నారు.
రాజ్యాంగం రద్దు.. అత్యయిక స్థితి..
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి 2007లో మరోసారి ఆ పీఠాన్ని ముషారఫ్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా తీర్పు రానుందని ముషారఫ్ పసిగట్టారు. తీర్పు వెలువడడానికి ముందుగానే.. ఉగ్రవాదాన్ని సాకుగా చూపి 2007 నవంబరు 3న రాజ్యాంగాన్ని రద్దు చేశారు. దేశంలో అత్యయిక స్థితి విధించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఇఫ్తికార్ ఎం చౌధరిని పదవి నుంచి తొలగించారు. తనకు అనుకూలంగా ఉన్న జస్టిస్ అబ్దుల్ హమీద్ దోగార్‌ను హుటాహుటిన ఆ పదవిలో నియమించారు. కొత్త ప్రధాన న్యాయమూర్తి ముషారఫ్ ఎన్నికకు ఆమోదముద్ర వేయడంతో పరిస్థితులు తాత్కాలికంగా సద్దుమణిగాయి.
దిల్లీలో జన్మించిన ముషారఫ్..
దిల్లీ: పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న పాతదిల్లీలోనే జన్మించారు. అప్పట్లో ఆయన కుటుంబం అక్కడే నివసించేది. 1947లో పాకిస్థాన్ విడిపోయిన అనంతరం అక్కడికి వెళ్లిపోయింది. దాదాపు 6 దశాబ్దాల తర్వాత 2005లో పాక్ అధ్యక్షుడి హోదాలో భారత్‌లో 3 రోజుల పర్యటన సందర్భంగా ఆయన తన జనన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. పాత దస్త్రాలను వెలికితీయించి, భారత ప్రభుత్వం ప్రత్యేక కానుకగా అప్పట్లో ఆయనకు దీనిని అందించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సర్టిఫికెట్‌ను ముషారఫ్‌కు అందజేశారు. దిల్లీ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న గిరిధారీలాల్ ప్రసూతి ఆసుపత్రిలో నాడు ముషారఫ్ జన్మించారు.
మళ్లీ రాతియుగంలోకి పంపిస్తామన్న అమెరికా
ఇస్లామాబాద్: అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడుల తర్వాత అఫ్గానిస్థాన్‌పై అమెరికా ప్రకటించిన యుద్ధానికి సహకరించకపోతే పాక్‌పై బాంబులు వేసి మళ్లీ రాతియుగంలోకి నెట్టేస్తామని అగ్రరాజ్యం హెచ్చరించింది. ఈ విషయాన్ని ముషారఫ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నారు. పాక్ ఐఎస్‌ఐ చీఫ్‌కు అప్పట్లో ఈ హెచ్చరికను అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి చేశారని వెల్లడించారు. అమెరికాకు మద్దతు ఇస్తామో, ఉగ్రవాదులకు వంత పాడతామో చెప్పాల్సిందిగా అగ్రరాజ్యం ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అమెరికాతో చేతులు కలిపామని ఆ పుస్తకంలో వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగ మార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
-
General News
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?