ఉత్థానం నుంచి పతనానికి.. ముషారఫ్‌ను ఇబ్బంది పెట్టిన ఏడు నిర్ణయాలు
అటు సైన్యంలో, ఇటు ప్రభుత్వంలో ఒక వెలుగువెలిగిన పర్వేజ్ ముషారఫ్ అనేక వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువు. ఆయన పతనానికి ప్రధానంగా కొన్ని కారణాలు దారి తీశాయని చెబుతుంటారు.
ఇస్లామాబాద్: అటు సైన్యంలో, ఇటు ప్రభుత్వంలో ఒక వెలుగువెలిగిన పర్వేజ్ ముషారఫ్ అనేక వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువు. ఆయన పతనానికి ప్రధానంగా కొన్ని కారణాలు దారి తీశాయని చెబుతుంటారు.
1) రెడ్ మాస్క్ ఆపరేషన్: ప్రజల్ని వేధించడానికి మసీదు కేంద్రంగా స్థావరం ఏర్పరచుకున్న ఉగ్రవాదులు, అతివాదుల్ని ఏరివేయడానికంటూ 2007 జులై 3 నుంచి 11 వరకు నిర్వహించిన ఆపరేషన్‌లో మసీదు లోపల ఉన్న వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇస్లామిస్టులకు ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. ఇతర దేశాల నుంచి మద్దతు లభించినా దేశీయంగా అప్రతిష్ఠ మిగిలింది.
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపు: స్వతంత్రంగా వ్యవహరించే పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ ముహమ్మద్ చౌధ్రీని 2007 మార్చి 9న ముషారఫ్ తొలగించారు. దీనిపై న్యాయవాదులు పెద్దఎత్తున ఉద్యమించారు. తర్వాత ప్రధాన న్యాయమూర్తిని తిరిగి నియమించినా, మొదటి నిర్ణయం వల్ల తలెత్తిన పరిణామాల నుంచి ముషారఫ్ బయటకురాలేకపోయారు.
3) అత్యయిక పరిస్థితి విధింపు: 2007 నవంబరు 3న పాక్‌లో ముషారఫ్ విధించిన అత్యయిక పరిస్థితి ఆ ఏడాది డిసెంబరు 15 వరకు కొనసాగింది. ఇది ఆయన్ని ప్రజల నుంచి మరింత దూరం చేయడంతో పాటు చట్టపరంగా చిక్కులకు దారితీసింది. ప్రత్యేక న్యాయస్థానం ఈ అంశంలో ఆయనకు మరణ శిక్ష విధించింది.
4) అక్బర్ బుగ్తీ హత్య: స్వల్పస్థాయి తిరుగుబాటును నియంత్రించేందుకు బలూచిస్థాన్‌లో చేపట్టిన సైనికచర్య, ఆ పోరులో గిరిజన నేత నవాజ్ అక్బర్‌ఖాన్ బుగ్తీ ప్రాణాలు కోల్పోవడంతో ముషారఫ్‌పై హత్యానేరం నమోదైంది. కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది.
5) బెనజీర్ భుట్టో హత్య: మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007 డిసెంబరు 27న రావల్పిండిలో ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆమెకు తగినంత భద్రతను కల్పించడంలో ముషారఫ్ సర్కారు వైఫల్యమేనని ఐరాస విచారణలో తేలింది. దీనిపైనా హత్యానేరాన్ని ఆయన ఎదుర్కొన్నారు.
6) కరాచీలో మరణాలు: పాక్ ప్రధాన న్యాయమూర్తిగా తొలగింపునకు గురైన జస్టిస్ చౌధ్రీ 2007 మే 12న కరాచీకి వచ్చినప్పుడు జరిగిన అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం ముషారఫ్ అని బలంగా వినిపించింది.
7) అమెరికాతో జత కట్టడం: అఫ్గానిస్థాన్‌తో యుద్ధం విషయంలో అమెరికాతో పాకిస్థాన్ జత కట్టడం వల్లనే పాక్‌లో హింస, ఉగ్రవాదం బాగా పెరిగిపోయాయని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సహా పలువురి నుంచి విమర్శలు ఉన్నాయి. ఈ నిర్ణయంవల్ల అనేక సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లయిందని వారి అభిప్రాయం.
భుట్టో హత్యతో..
పాక్ మాజీ ప్రధానమంత్రి, విపక్ష నేత బెనజీర్ భుట్టో 2007 డిసెంబరులో హత్యకు గురయ్యారు. ఆమె హత్య విషయంలో ముషారఫ్‌పై ఆరోపణలొచ్చాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిపోవడంతో తర్వాతి ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిపించక తప్పలేదు. అందులో ముషారఫ్ మిత్రపక్షాలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. ఫలితంగా ఆయన ఒంటరయ్యారు. 2008లో అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు ముషారఫ్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. తనకు ఉద్వాసన తప్పదని గుర్తించి.. ఆయనే స్వయంగా రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడిగా ముషారఫ్ ఏడేళ్లకు పైగానే ఉన్నారు. ఆ సమయంలో పలుమార్లు హత్యాయత్నాల నుంచి బయటపడ్డారు. అమెరికాపై 9/11 దాడులు జరిగిన అనంతరం.. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశంతో ముషారఫ్ చేతులు కలిపారు. పలు ఇస్లామిక్ సంస్థలపై ఉక్కుపాదం మోపారు. డజన్లకొద్దీ తీవ్రవాద సంస్థలను నిషేధించారు. వాటి ఫలితంగానే ఆయనపై హత్యాయత్నాలు జరిగినట్లు చెబుతుంటారు. అధ్యక్ష పీఠాన్ని వీడిన కొన్నాళ్లకే ముషారఫ్ విదేశాలకు పారిపోయారు. 2010లో సొంతంగా ఏపీఎంఎల్ పార్టీని స్థాపించారు. 2013లో స్వదేశానికి తిరిగొచ్చారు. మళ్లీ అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచించారు. అయితే భుట్టో హత్య, దేశద్రోహం వంటి కేసుల కారణంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత పడటంతో నిరాశే ఎదురైంది.
మరణశిక్ష ఖరారు.. రద్దు
రాజ్యాంగాన్ని రద్దు చేసి, అత్యయిక స్థితి విధించినందుకు 2014 మార్చిలో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆ కేసులో 2019 డిసెంబరులో ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష ఖరారు చేసింది. ఆ సమయంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ముషారఫ్‌ను ఉరితీయండి. ఆయన మృతదేహాన్ని పార్లమెంటు ఎదురుగా ఉన్న డీస్క్వేర్ వద్దకు తీసుకురండి. ప్రజలకు గుర్తుండిపోయేలా మూడు రోజలపాటు కూడలిలో మృతదేహాన్ని వేలాడదీయండి’’ అని పేర్కొంది. అయితే ఆ మరుసటి ఏడాది మరణశిక్ష రద్దయింది. అంతకుముందు, 2013లో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలివ్వగా.. ముషారఫ్ పారిపోయి ఫామ్‌హౌజ్‌లో దాక్కున్నారు. పోలీసులు ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచారు. 2016లో కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడంతోపాటు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. తనపై ఉన్న కేసుల్లో ఎప్పటికైనా శిక్ష తప్పదని భావించిన ముషారఫ్.. చికిత్స పేరుతో అదే ఏడాది మార్చిలో యూఏఈ వెళ్లిపోయారు.
* ముషారఫ్ 1968లో షెబాను వివాహమాడారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
* పాక్‌లో మరణశిక్ష ఖరారైన తొలి సైనిక పాలకుడు ముషారఫే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
XBB.1.16: కొవిడ్ తాజా విజృంభణకు ఈ వేరియంట్ కారణమా..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
-
General News
AP High court: ఏపీ హైకోర్టు తరలింపు న్యాయస్థానాల పరిధిలోనే: కేంద్ర ప్రభుత్వం
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు