సంక్షిప్త వార్తలు (6)

దీపావళిని ఫెడరల్‌ సెలవు దినంగా ప్రకటించాలని అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్రతిపాదనకు వచ్చింది. గ్రేస్‌ మెంగ్‌ అనే సభ్యురాలు ప్రతినిధుల సభలో శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Updated : 28 May 2023 06:18 IST

అమెరికాలో దీపావళికి సెలవు ప్రకటించాలని బిల్లు

బైడెన్‌ సంతకమే తరవాయి..

వాషింగ్టన్‌: దీపావళిని ఫెడరల్‌ సెలవు దినంగా ప్రకటించాలని అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్రతిపాదనకు వచ్చింది. గ్రేస్‌ మెంగ్‌ అనే సభ్యురాలు ప్రతినిధుల సభలో శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘దీపావళి అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జరుపుకొనే పండగ. అమెరికాలోనూ దీనికి ప్రాముఖ్యం ఉంది. దీపావళి రోజున సెలవు ప్రకటిస్తే.. అన్ని వర్గాలు కలిసి పండగను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. విభిన్న వర్గాల విశ్వాసాలకు విలువ ఇచ్చినట్లూ ఉంటుంది’ అని మెంగ్‌ విలేకర్లతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ బిల్లు కాంగ్రెస్‌ ఆమోదం పొంది, ఉత్తర్వులపై బైడెన్‌ సంతకం పెడితే 12వ ఫెడరల్‌ సెలవు దినంగా దీపావళి అమల్లోకి రానుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన మెంగ్‌పై వివిధ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


పక్షి ఢీకొట్టడంతో వెనక్కి వెళ్లిన నేపాల్‌ విమానం

కాఠ్‌మాండూ: బెంగళూరుకు బయలుదేరిన నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం పక్షి ఢీ కొట్టడంతో తిరిగి కాఠ్‌మాండూ విమానాశ్రయానికి చేరుకుంది. ఏ-320 విమానం శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు టేకాఫ్‌ అయింది. బెంగళూరుకు అది చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యంలో పక్షి ఢీ కొనడంతో 25 నిమిషాల తర్వాత తిరిగి కాఠ్‌మాండూలోని త్రిభువన్‌ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులను వేరే విమానంలో బెంగళూరుకు తరలించారు.


ఇరాన్‌, అఫ్గాన్‌ సరిహద్దులో కాల్పులు

ముగ్గురు ఇరాన్‌ గార్డుల మృతి?

దుబాయ్‌: నీటి హక్కులపై ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య వివాదం కాల్పులకు దారితీసింది. సిస్టాన్‌, బలూచిస్థాన్‌ సరిహద్దులోని కాంగ్‌ ప్రాంతంలో శనివారం ఉదయం ఇరాన్‌ గార్డులకు, తాలిబన్‌ గస్తీ దళాలకు మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఇరాన్‌ గార్డులు చనిపోయారని, పలువురు గాయపడ్డారని టెహ్రాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. అయితే రెండు దేశాలకు చెందిన ఒక్కొక్కరు మరణించారని, కొంత మంది గాయపడ్డారని అఫ్గాన్‌ మంత్రి అబ్దుల్‌ నఫీ తెలిపారు. ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా వివరాలను వెల్లడించలేదు.


శ్వేతసౌధం సలహాదారుగా నీరా టాండన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనంలో డొమెస్టిక్‌ పాలసీ సలహాదారు పదవిని భారతీయ అమెరికన్‌ మహిళ నీరా టాండన్‌ (52) శనివారం చేపట్టారు. వైట్‌హౌస్‌లో కీలకమైన మూడు సలహాదారు పదవుల్లో ఇది ఒకటి. మిగతా రెండు జాతీయ భద్రతామండలి, జాతీయ ఆర్థికమండలి పదవులు. ఈ మూడింటిలో ఒకదాన్ని ఓ భారత సంతతి వ్యక్తి చేపట్టడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పదవిలో ఆమె వలస వ్యవహారాలతోపాటు పోలీసు సంస్కరణలు, నేరాల నిరోధక బాధ్యతలనూ నిర్వహిస్తారు. బిల్‌క్లింటన్‌ హయాంలో నీరా వైట్‌హౌస్‌లో డొమెస్టిక్‌ పాలసీ మండలికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.


జపొరిజియాలో రష్యా కవ్వింపు చర్యలు

ఉక్రెయిన్‌ ఆరోపణ

కీవ్‌: జపొరిజియా అణువిద్యుత్కేంద్రంపై రష్యా దాడి చేసి, రేడియో ధార్మికతను లీక్‌ చేసేలా కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. తద్వారా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దింపేలా ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది. దీనివల్ల పోరు ఆగుతుందని, పరాజయం పాలవుతున్న తమ సేనలకు ఎదురుదాడులు చేయడానికి తగిన సమయం లభిస్తుందని మాస్కో భావిస్తోందని పేర్కొంది.


రష్యాలోకి ఉక్రెయిన్‌ డ్రోన్లు!

మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కీలక మలుపులు తీసుకుంటోంది. నిన్న మొన్నటివరకు ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు సాగిస్తే.. పరిస్థితి ఇప్పుడు నెమ్మదిగా తారుమారవుతోంది. రష్యా భూభాగాలపైనా దాడులు జరుగుతున్నాయి. శనివారం స్కోవ్‌ రీజియన్‌లోని చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి జరిగింది. పైప్‌లైన్‌ పాలక భవనానికి నష్టం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్‌ ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని