సరిహద్దుల రక్షణకు మహా ఉక్కు కుడ్యాన్ని సృష్టించండి

సరిహద్దు రక్షణ, నియంత్రణకు సంబంధించి సామర్థ్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా దేశ సరిహద్దుల వెంబడి మహా ఉక్కు కుడ్యాన్ని(గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌) సృష్టించాలని సరిహద్దు భద్రతా దళాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.

Updated : 10 Jun 2023 06:02 IST

చైనా బలగాలకు జిన్‌పింగ్‌ పిలుపు

బీజింగ్‌: సరిహద్దు రక్షణ, నియంత్రణకు సంబంధించి సామర్థ్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా దేశ సరిహద్దుల వెంబడి మహా ఉక్కు కుడ్యాన్ని(గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌) సృష్టించాలని సరిహద్దు భద్రతా దళాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. అధికార చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీసీ), సెంట్రల్‌ మిలిటరీ కమాండ్‌ (సీఎంసీ), పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఉన్నత కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న 69 ఏళ్ల జిన్‌పింగ్‌.. ఇన్నర్‌ మంగోలియా స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంలో సరిహద్దు బలగాల అభివృద్ధి, నియంత్రణ, నిర్వహణను పరిశీలించేందుకు బుధవారం పర్యటించారు. సరిహద్దు రక్షణను కొత్త పుంతలు తొక్కించాలని ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ బలగాలను కోరారు.


నా ‘కోర్టు మార్షల్‌’కు రంగం సిద్ధమైంది: ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: తన ‘కోర్టు మార్షల్‌’కు రంగం సిద్ధమైందని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. గత నెల 9న దేశంలో జరిగిన అల్లర్ల వెనుక ఉన్న వారిని సైనిక న్యాయస్థానాల్లో విచారిస్తామని సైన్యం స్పష్టంచేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన 150కిపైగా కేసులు నిరాధారమైనవని చెప్పారు. వీటిలో తనకు శిక్ష పడే అవకాశం లేదన్నారు. అందువల్ల సైనిక కోర్టులో తనను విచారించాలని నిర్ణయించారని చెప్పారు. దేశ ద్రోహం కేసులో తనను 10 ఏళ్లపాటు జైల్లో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.


ద్వైపాక్షిక బంధాల్లో సరికొత్త ప్రమాణాలు
మోదీ అమెరికా పర్యటనపై పెంటగాన్‌

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్రమోదీ త్వరలో నిర్వహించనున్న అమెరికా పర్యటన అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తాయని పెంటగాన్‌ పేర్కొంది. రక్షణరంగ సహకారంపై అతిభారీ, చరిత్రాత్మక, ఉత్సాహభరితమైన ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలిపింది. తద్వారా భారత్‌లో సైనికపరంగా దేశీయ పరిశ్రమలకు మరింత ఊతం లభిస్తుందని అమెరికా రక్షణశాఖ ఉన్నతాధికారి ఎలీ రట్నర్‌ పేర్కొన్నారు. గురువారం ‘సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ’లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ పర్యటన ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలు సమున్నత ఎత్తులను చేరుకుంటాయని చెప్పారు. దీనిలో భాగంగానే అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇటీవల భారత్‌లో పర్యటించి, కొన్ని ఒప్పందాలకు పూర్వ రంగాన్ని సిద్ధం చేశారని తెలిపారు. రక్షణ రంగంలో సంయుక్తంగా ఉత్పత్తుల్ని అభివృద్ధి చేయడం, కలిసి ఉత్పత్తి చేయడంపై వ్యూహాత్మకంగా అడుగులు పడనున్నాయని చెప్పారు. సైన్యాన్ని ఆధునికీకరించడానికి, రక్షణ పరిశ్రమలను బలోపేతం చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని రట్నర్‌ తెలిపారు. హిందూ మహాసముద్రంపై, సముద్ర గర్భంలో కార్యకలాపాలపై, అంతరిక్ష/ సైబర్‌ రంగాలపై తాము దృష్టి సారించి, సమన్వయాన్ని పెంపొందించుకుంటున్నట్లు చెప్పారు. బలమైన భారత్‌ తన ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని బలంగా పరిరక్షించుకోవడం అమెరికాకూ మంచిదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు