‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం

కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్‌ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు.

Published : 26 Apr 2024 03:55 IST

ఇజ్రాయెల్‌తో సంధి కూడా చేసుకుంటాం
రాజకీయ పార్టీగా అవతరిస్తాం
హమాస్‌ కీలక నేత ప్రకటన

ఇస్తాంబుల్‌: కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్‌ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అదేవిధంగా ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ‘పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌’లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు. ‘‘హమాస్‌ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్‌ విజయం సాధించలేదు. ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే దెబ్బతీయగలిగింది. యుద్ధం ముగుస్తుందని మాకు హామీ ఇవ్వకపోతే.. బందీలను ఎందుకు విడుదల చేస్తాం? ఒకవేళ హమాస్‌ను అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి? కాబట్టి.. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమం’’ అని అల్‌-హయ్యా వ్యాఖ్యానించారు. గాజాలో వినాశనానికి దారితీసినప్పటికీ.. అక్టోబరు 7 నాటి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు. పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు. శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్‌ బలగాల పూర్తిస్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అయితే అల్‌-హయ్యా డిమాండ్లను ఇజ్రాయెల్‌ పరిశీలించే అవకాశం లేదు. అక్టోబరు 7 దాడుల అనంతరం హమాస్‌ను నాశనం చేస్తామని ఆ దేశం ప్రతిజ్ఞ చేసింది. అంతేకాదు.. బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఏమాత్రం సుముఖంగా లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు