భవిష్యత్తుకు దిక్సూచి ‘బ్రిక్స్‌’

భవిష్యత్తుకు బ్రిక్స్‌ సదస్సు దిక్సూచిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు సహకారానికి సంబంధించిన అంశాలను గుర్తించడానికి ఇదో చక్కని అవకాశమని, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Published : 23 Aug 2023 05:15 IST

ప్రధాని మోదీ వ్యాఖ్యలు  
జొహన్నెస్‌బర్గ్‌ చేరిక  
బ్రిక్స్‌ సమావేశాలు ప్రారంభం

దిల్లీ, జొహన్నెస్‌బర్గ్‌: భవిష్యత్తుకు బ్రిక్స్‌ సదస్సు దిక్సూచిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు సహకారానికి సంబంధించిన అంశాలను గుర్తించడానికి ఇదో చక్కని అవకాశమని, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. 15వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం దిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని సాయంత్రానికి దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్‌బర్గ్‌ చేరుకున్నారు. వాటర్‌క్లూఫ్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో దిగిన ప్రధానికి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ మషటైల్‌ స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, ప్రిటోరియా హిందూ సేవా సమాజ్‌ కార్యకర్తలు, స్వామి నారాయణ్‌ సంస్థ సభ్యులు ప్రధానిని ఘనంగా ఆహ్వానించారు. అక్కడి నుంచి ఆయన సదస్సు జరిగే శాండ్‌టన్‌ సన్‌ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ స్థానిక, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇద్దరు మహిళలు రాఖీ కట్టారు. స్వామి నారాయణ్‌ ఆలయ నమూనాను ప్రధాని తిలకించారు. వచ్చే ఏడాది అది పూర్తి కానుంది. మోదీ దక్షిణాఫ్రికాకు బయలుదేరేముందు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత ట్విటర్‌లోనూ ఆయన స్పందించారు. ‘దక్షిణార్థ గోళంలోని ఆందోళనలపై చర్చించడానికి, కొత్త ఆలోచనలకు బ్రిక్స్‌ వేదికగా మారింది. అభివృద్ధిలో అసమానతలను తొలగించడానికి, బహుముఖ వ్యవస్థను సంస్కరించడానికి వీలు కలుగుతుంది’ అని ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. మంగళవారం నుంచి గురువారం వరకూ జరిగే బ్రిక్స్‌ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు. ఆయనను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా ఆహ్వానించారు. 2019 తర్వాత ప్రత్యక్షంగా బ్రిక్స్‌ సదస్సు జరగడం ఇదే తొలిసారి. బ్రిక్స్‌ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరుకావడం లేదు. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల కూటమి అయిన బ్రిక్స్‌ భేటీకి చైనా అధినేత జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ లూలా డ సిల్వా, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా హాజరవుతున్నారు.

  • బ్రిక్స్‌ సదస్సు తర్వాత ప్రధాని శుక్రవారం గ్రీస్‌లో పర్యటిస్తారు. 40ఏళ్ల తర్వాత భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  

భారత్‌ త్వరలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ: మోదీ

భారత్‌ త్వరలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, ప్రపంచానికి గ్రోత్‌ ఇంజిన్‌గా మారనుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం లీడర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. మిషన్‌ మోడ్‌ సంస్కరణలతో భారత్‌లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తాము అభివృద్ధి చేసిన డిజిటల్‌ పేమెంట్స్‌ విధానం బ్రిక్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి బ్రిక్స్‌ దేశాలు గణనీయ కృషి చేస్తున్నాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని