సరిహద్దుల్లో శాంతి నెలకొల్పుదాం

సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Published : 25 Aug 2023 06:08 IST

వాస్తవాధీన రేఖను గౌరవిద్దాం
అప్పుడే రెండు దేశాల సంబంధాల్లో సాధారణ స్థితి
జిన్‌పింగ్‌కు మోదీ స్పష్టీకరణ
బ్రిక్స్‌లోకి మరో 6 దేశాలు

జొహన్నెస్‌బర్గ్‌: సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖను గౌరవించుకోవడం అవసరమని, సరిహద్దుల్లో శాంతి, సోదరభావంతో మెలుగుదామని సూచించారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా బుధవారం జిన్‌పింగ్‌, మోదీ మాట్లాడుకున్నారని గురువారం భారత విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా వెల్లడించారు. సరిహద్దుల్లో త్వరితగతిన సైనిక బలగాల ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలివ్వాలని ఇరువురు నేతలు ఒక అంగీకారానికి వచ్చారని తెలిపారు. జీ-20 సదస్సుకు జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారా అన్న ప్రశ్నకు క్వాత్రా సమాధానమివ్వలేదు. గురువారం బ్రిక్స్‌ సదస్సు వేదిక వద్దకు వెళ్లేటప్పుడూ మోదీ, జిన్‌పింగ్‌ మాట్లాడుకున్నారు. సంయుక్త విలేకరుల సమావేశం అనంతరం క్లుప్తంగా మాట్లాడుకున్నారని, కరచాలనం చేసుకున్నారంటూ అందుకు సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా అధికార వార్తా ఛానల్‌ ఎస్‌ఏబీసీ ప్రసారం చేసింది. గత ఏడాది నవంబరులో జీ-20 సదస్సు తర్వాత వారిద్దరు మాట్లాడుకోవడం ఇదే ప్రథమం.  

  • ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో పాశ్చాత్య ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా భావిస్తున్న వర్ధమాన దేశాల కూటమి బ్రిక్స్‌ మరింత బలోపేతం దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలకే పరిమితమైన ఈ కూటమిలోకి కొత్తగా మరో ఆరు దేశాలు చేరనున్నాయి. 2024 జనవరి 1 నుంచి అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ బ్రిక్స్‌లో చేరతాయి. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్‌ సదస్సు విస్తరణపై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డ సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. ‘బ్రిక్స్‌ విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలు, ప్రమాణాలు, విధానాలపై చర్చించాం. తొలిదశ విస్తరణకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆరు దేశాలను పూర్తి స్థాయి సభ్యులుగా బ్రిక్స్‌లోకి ఆహ్వానిస్తున్నాం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా వెల్లడించారు.  
  • బ్రిక్స్‌ సదస్సులో ఉగ్రవాదం అంశంపై చైనాకు కాసింత ఇరకాటం ఎదురైంది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో ద్వంద్వ ప్రమాణాలను అంగీకరించేది లేదని బ్రిక్స్‌ సదస్సు కుండబద్దలు కొట్టింది.

పూర్తి మద్దతు: మోదీ

బ్రిక్స్‌ విస్తరణకు ఆమోదం తెలిపిన భారత్‌.. దీన్నుంచి ఐరాసలాంటి ప్రపంచ సంస్థలన్నీ పాఠం నేర్చుకోవాలని పరోక్షంగా ఎత్తిచూపింది. ‘బ్రిక్స్‌ విస్తరణ, ఆధునికీకరణను చూసి.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలో ప్రపంచ సంస్థలన్నీ గుర్తించాలి. బ్రిక్స్‌ విస్తరణకు భారత్‌ పూర్తి స్థాయి మద్దతిస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఎందుకీ విస్తరణ?

అమెరికా సారథ్యంలోని పాశ్చాత్య కూటమి జీ-7కు పోటీగా బ్రిక్స్‌ను తయారు చేయాలన్నది రష్యా, చైనాల ఉద్దేశంగా భావిస్తున్నారు. భారత్‌, చైనా, బ్రెజిల్‌లాంటి దూసుకెళుతున్న దేశాలుండటం దీని బలం. వీటికితోడు 23 దేశాలు బ్రిక్స్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకుకు పోటీగా ఈ కూటమి సొంతగా న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ను ఇప్పటికే ఆరంభించింది. ఇప్పటిదాకా వివిధ దేశాలకు 33 బిలియన్‌ డాలర్ల రుణాలు అందజేసింది. ఇప్పుడు మరిన్ని దేశాలు చేరుతుండటంతో ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయాల్లో బ్రిక్స్‌ ప్రాధాన్యం ఇంకా పెరుగుతుందనుకుంటున్నారు.

అధినేతలతో మోదీ భేటీ

  • ప్రధాని మోదీ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ అలీతో సమావేశమయ్యారు. రక్షణ, వ్యవసాయ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.
  • సెనెగల్‌ అధ్యక్షుడు మ్యాకీ సల్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. ఇంధన, మౌలిక వసతులు, రక్షణ రంగాలపై చర్చించారు.
  • బ్రిక్స్‌ డిన్నర్‌లో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో మోదీ మాట్లాడారు. బుధవారం రాత్రి రమఫోసా ఈ డిన్నర్‌ ఏర్పాటు చేశారు.
  • ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, తీవ్రవాదం, అఫ్గానిస్థాన్‌ అంశాలపై వారు చర్చించారు.
  • మొజాంబిక్‌ అధ్యక్షుడు ఫిలిప్‌ న్యూసీతో మోదీ చర్చలు జరిపారు.
  • ఆఫ్రికాకు నమ్మకమైన భాగస్వామి భారత్‌ అని మోదీ స్పష్టం చేశారు. బ్రిక్స్‌తోపాటు ఆఫ్రికా దేశాల అధినేతలతో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని