కర్బన సుంకంపై పీటముడి

భారత్‌, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యం స్థాయిని బట్టి కర్బన సుంకం విధించాలన్న ఐరోపా సంఘం (ఈయూ) ప్రణాళికలు దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 సదస్సులో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Updated : 11 Dec 2023 06:14 IST

పలు ఉత్పత్తులపై కాలుష్య పన్ను విధింపునకు ఈయూ ప్రణాళికలు
భారత్‌ సహా పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత
కాప్‌-28 సదస్సులో వాడీవేడిగా చర్చ

దుబాయ్‌: భారత్‌, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యం స్థాయిని బట్టి కర్బన సుంకం విధించాలన్న ఐరోపా సంఘం (ఈయూ) ప్రణాళికలు దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 సదస్సులో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అలాంటి పన్ను అమల్లోకి వస్తే- తమ ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని, ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందని పేద దేశాలు వాదిస్తున్నాయి. సాధారణంగా ఇనుము, ఉక్కు, సిమెంటు, ఎరువులు, అల్యూమినియం వంటి ఉత్పత్తుల తయారీకి అధిక ఇంధనం అవసరం. తమ సంఘంలోని సభ్య దేశాల్లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నామని.. ఇతర దేశాలు మాత్రం కాలుష్య స్థాయులను పట్టించుకోవడం లేదని ఈయూ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈయూయేతర దేశాల నుంచి అలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్య ఉద్గారాల స్థాయిని బట్టి ‘కార్బన్‌ బార్డర్‌ అడ్జస్ట్‌మెంట్‌ మెకానిజం (సీబీఏఎం)’ పేరుతో కర్బన సుంకం వసూలు చేయాలని కాప్‌-28 సదస్సు సందర్భంగా ఈయూ ప్రతిపాదించింది. అప్పుడే హరిత ప్రమాణాలను అనుసరిస్తున్న తమ దేశీయ పరిశ్రమలకు మేలు చేకూరుతుందని పేర్కొంది. 2030 కల్లా కర్బన ఉద్గారాలను 55% దాకా తగ్గించాలన్న తమ లక్ష్యాన్ని అందుకునేందుకు ఈ సుంకం అవసరమని స్పష్టం చేసింది.

పేద దేశాలకు 590 కోట్ల డాలర్ల నష్టం

భారత్‌ సహా ఇతర వర్ధమాన, పేద దేశాలు సీబీఏఎంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. ఆ సుంకం వల్ల ఈయూకు తమ ఉత్పత్తుల ఎగుమతి చాలా ప్రియంగా మారుతుందని అవి వాదిస్తున్నాయి. కర్బన సుంకం అమల్లోకి వస్తే.. దాని రూపంలో ధనిక దేశాలు ఏటా 250 కోట్ల డాలర్లు పొందే అవకాశముందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సదస్సు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో పేద దేశాలు 590 కోట్ల డాలర్లు కోల్పోయే ముప్పుందని నిర్ధారించింది. ప్రధానంగా ఆఫ్రికా దేశాలపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ముప్పుందని తెలిపింది. మరోవైపు- అమెరికా, కెనడా వంటి దేశాలూ ఇతర రూపాల్లో కర్బన సుంకం వసూలుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.


కాప్‌-29 సదస్సు వేదిక బాకు

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘29వ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌-29)’ సదస్సుకు అజర్‌బైజాన్‌ దేశ రాజధాని బాకు వేదికగా నిలవనుంది.


ముసాయిదా విడుదల

కాప్‌-28 సదస్సులో జరిపిన చర్చలపై ఆదివారం ముసాయిదా పత్రం విడుదలైంది. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ శతాబ్దాంతానికి భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరే దిశగా ప్రస్తుతం అడుగులు పడటం లేదని దానిద్వారా స్పష్టమవుతోంది. కాలుష్య కట్టడికి అవసరమైన హరిత ప్రమాణాలను అమలు చేసేందుకు వర్ధమాన, పేద దేశాలకు ఏటా 21,500 కోట్ల డాలర్ల నుంచి 38,700 కోట్ల డాలర్ల వరకు అవసరమని ముసాయిదాలో పేర్కొన్నారు. కానీ కాలుష్య నివారణ కోసం వాటికి అందుతున్న నిధులు మాత్రం 2,100 కోట్ల డాలర్లకు మించడం లేదని వెల్లడించారు. మరోవైపు- కాప్‌-28లో చర్చలు ఆశించిన వేగంతో సాగడం లేదంటూ సదస్సు అధ్యక్షుడు సుల్తాన్‌ అల్‌-జబేర్‌ విచారం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని