విపక్షంలో కూర్చుంటాం.. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ ప్రకటన

పాకిస్థాన్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో.. పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నిర్ణయించింది.

Updated : 17 Feb 2024 05:52 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో.. పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పీటీఐకి చెందిన బారిస్టర్‌ అలీ సయీఫ్‌ శుక్రవారం రాత్రి ప్రకటించారు. ‘‘ఒకవేళ ఓట్లు, సీట్లను తారుమారు చేయకుంటే నేడు మా పార్టీకి 180 స్థానాలు వచ్చి ఉండేవి. మమ్మల్ని మోసం చేశారు. అందుకే విపక్షంలో కూర్చోవాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉమర్‌ అయూబ్‌ఖాన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అస్లాం ఇక్బాల్‌ను ఎంపికచేసిన ఒకరోజు తర్వాత పీటీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచడానికి చేతులు కలిపిన పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ మధ్య శుక్రవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ రెండు పార్టీలు కలిసి నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  

సైఫర్‌, తోషాఖానా శిక్షలపై హైకోర్టుకు ఇమ్రాన్‌

అధికార రహస్యాల ఉల్లంఘన (సైఫర్‌), తోషాఖానా కేసుల్లో ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షలను పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ శుక్రవారం ఇస్లామాబాద్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌కు ఈ రెండు కేసుల్లోనూ కోర్టు వరుసగా 10,14 ఏళ్ల జైలు శిక్షలను విధించిన సంగతి తెలిసిందే. సైఫర్‌ కేసులో ఇమ్రాన్‌ భార్య బుష్రా బీబీ(49)కి కూడా న్యాయస్థానం 14 ఏళ్ల శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె కూడా జైలులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని