రఫా క్రాసింగ్‌ను ఆక్రమించిన ఇజ్రాయెల్‌

కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్‌ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్‌ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.

Updated : 08 May 2024 06:18 IST

హమాస్‌పై దాడులు ప్రారంభం

జెరూసలెం: కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్‌ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్‌ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ తమకు తెలిపినట్లు ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు.  దీనిపై ఇజ్రాయెల్‌ స్పందించలేదు. ఈ రఫా క్రాసింగ్‌ నుంచే ఆదివారం రాత్రి హమాస్‌ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఈ ఆపరేషన్‌ను ఐడీఎఫ్‌ ప్రారంభించింది. రఫా క్రాసింగ్‌ ఆక్రమణ గాజా పోరులో కీలక ఘట్టమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.

హమాస్‌ అంగీకరించిన వెంటనే...

రఫాపై సోమవారం ఇజ్రాయెల్‌ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. కాల్పుల విరమణకు హమాస్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇది తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ బెంజమిన్‌ నెతన్యాహు తిరస్కరించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్‌ యుద్ధ కేబినెట్‌ సమావేశమై.. రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది. వెంటనే ఐడీఎఫ్‌ యుద్ధట్యాంకులతో ప్రవేశించి రఫా క్రాసింగ్‌ను ఆక్రమించింది. కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో మాత్రం యథావిధిగా పాల్గొంటామని ఇజ్రాయెల్‌ పేర్కొంది.

ఆగిన సాయం

ఇజ్రాయెల్‌ ఆక్రమణతో రఫా క్రాసింగ్‌ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్‌ అథారిటీ ప్రతినిధి వేల్‌ అబు ఒమర్‌ తెలిపారు. ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు