Akshata Murthy: భారత్‌ అంటే నా భార్యకు అమితమైన ప్రేమ: రిషి సునక్‌

తన భార్య అక్షతా మూర్తి ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదాపై వస్తున్న విమర్శలను బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ తిప్పికొట్టారు. ఆమె పన్ను ఎగవేస్తున్నారంటూ ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బ్రిటన్‌లో సంపాదిస్తున్న

Published : 09 Apr 2022 08:02 IST

నా మావయ్య చాలా గొప్ప వ్యక్తి
ఆయన్ను చూసి గర్విస్తున్నా
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి

లండన్‌: తన భార్య అక్షతా మూర్తి ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదాపై వస్తున్న విమర్శలను బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ తిప్పికొట్టారు. ఆమె పన్ను ఎగవేస్తున్నారంటూ ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బ్రిటన్‌లో సంపాదిస్తున్న ప్రతి పెన్నీకి తన భార్య పన్ను చెల్లిస్తోందని, అలానే అంతర్జాతీయంగా ఆర్జిస్తున్న ఆదాయానికీ పన్ను జమ చేస్తోందని వివరణ ఇచ్చారు. సునక్‌ భార్య అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. ‘‘నన్ను పెళ్లి చేసుకుందన్న కారణంతో ఆమెను తన సొంత దేశంతో సంబంధాలు తెంచుకోమనడం సహేతుకం కాదు. ఆమెకు తన దేశమంటే ప్రేమ. తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకొనేందుకు ఆమె ఎప్పటికైనా భారత్‌ తిరిగి వెళ్లిపోతారు. ఆమెలానే నాకూ నా దేశమంటే ప్రేమ. బ్రిటిష్‌ పౌరసత్వాన్ని ఎన్నటికీ వదులుకోను. నా మావయ్యను చూసి గర్విస్తా. ఆయనపైనా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి ప్రపంచస్థాయి వ్యాపార సంస్థను ఆయన తీర్చిదిద్దారు. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. భారత్‌ ముఖచిత్రాన్నే ఆయన మార్చారు’’ అని సునక్‌ పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఉంటూ వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే తాను చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి తెలిపారు. సునక్‌ సన్నిహితులు మాత్రం ఇవి రాజకీయ ప్రేరిత ఆరోపణలు అంటున్నారు. భవిష్యత్తులో సునక్‌ బ్రిటన్‌ ప్రధాని కావచ్చొన్న అంచనాల నేపథ్యంలోనే రాజకీయంగా ఆయన ఎదుగుదలను అడ్డుకొనే కుట్రలో భాగమే ఈ విమర్శలని వారు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని