UAE President: యూఏఈ అధ్యక్షుడు, అబుదాభీ రాజు షేక్‌ ఖలీఫా మృతి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు, అబుదాభీ పాలకుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ (73) శుక్రవారం కన్నుమూశారు. ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. యూఏఈ అధ్యక్ష

Updated : 14 May 2022 05:41 IST

 ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సంతాపం 

 నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించిన కేంద్రం

దుబాయ్, దిల్లీ: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు, అబుదాభీ పాలకుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ (73) శుక్రవారం కన్నుమూశారు. ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. యూఏఈ అధ్యక్ష వ్యవహారాలశాఖ ఈ విషయాన్ని వెల్లడిస్తూ 40 రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు శుక్రవారం నుంచి మూడు రోజులు మూసి ఉంటాయని తెలిపింది. అంతటా జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. షేక్‌ ఖలీఫా సోదరుడైన అబుదాభీ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ తదుపరి యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. అబుదాభీ పాలకుడు షేక్‌ ఖలీఫా మృతి సందర్భంగా ఆయన గౌరవార్థం శనివారం ఒక్కరోజు సంతాప దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు శుక్రవారం సమాచారం పంపింది. అన్నిచోట్లా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని, అధికారిక కార్యక్రమాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. షేక్‌ ఖలీఫాను గొప్ప రాజనీతిజ్ఞుడిగా, దార్శనిక నేతగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘షేక్‌ ఖలీఫా కుటుంబానికి, గల్ఫ్‌ ప్రజలకు సంతాపం తెలుపుతున్నా. యూఏఈని ఆయన శరవేగంగా అభివృద్ధి చేశారు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.

* 1948లో జన్మించిన షేక్‌ ఖలీఫా యూఏఈకి రెండో ప్రధానిగా 2004 నవంబర్‌ 3న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అబుదాభీ పాలకుడిగానూ కొనసాగుతున్నారు. అంతకుముందు ఈయన తండ్రి షేక్‌ జయేద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ 1971 నుంచీ యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండేవారు. 2004 నవంబర్‌లో బిన్‌ సుల్తాన్‌ మరణించగా.. షేక్‌ ఖలీఫా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఫెడరల్‌ ప్రభుత్వంతోపాటు అబుదాభీ ప్రభుత్వ పునర్నిర్మాణం కోసం కృషి చేశారు. ఈయన హయాంలో యూఏఈ ఆర్థికాభివృద్ధి గణనీయంగా పుంజుకొంది. ప్రజలకు కనీస వసతులు అందేలా కృషి చేశారు. దశాబ్దం క్రితం ఆర్థికసంక్షోభంలో ఉన్న దుబాయ్‌ను ఆదుకొన్న తర్వాత ఈయన పేరు ప్రపంచంలో ఎత్తయిన భవనమైన బుర్జ్‌ ఖలీఫాపై చిరస్థాయిగా నిలిచిపోయింది.  

భారత్‌కు మిత్రుడు : జైశంకర్‌

విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ట్విటర్‌ ద్వారా తన సంతాపం తెలుపుతూ ‘యూఏఈ ఆధునిక నేతగా షేక్‌ ఖలీఫా గుర్తుండిపోతారు. భారత్‌తో సంబంధాలకు ఆయనెంతో ప్రాధాన్యం ఇచ్చారు’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని