Ukraine Crisis: మేం చేసిన పాపమేంటి?

యుద్ధం రెండక్షరాల పదం.. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నో జీవితాల్లో చీకట్లు నింపే మహా విషాదం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఉన్నట్టుండి జీవితాలు అంధకారంలో కూరుకుపోయిన

Updated : 19 May 2022 05:23 IST

యుద్ధం రెండక్షరాల పదం.. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నో జీవితాల్లో చీకట్లు నింపే మహా విషాదం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఉన్నట్టుండి జీవితాలు అంధకారంలో కూరుకుపోయిన దురదృష్టవంతులు వీరంతా. అప్పటివరకు ఇంట్లో అల్లారు ముద్దుగా పరుగులు తీసిన చిన్నారి యానా, ఆమెను పట్టుకుని అదుపు చేసేందుకు పరుగెత్తే తల్లి నటాషా స్తెపానెకో.. ఇద్దరూ రెండు కాళ్లూ కోల్పోయి మంచానికే పరిమితమైతే.. ఆ విషాదాన్ని తట్టుకోవడం ఆ కుటుంబానికి సాధ్యమేనా? బయటి నుంచి వచ్చీ రాగానే ప్రేమానురాగాలతో చుట్టేసుకునే సతీమణి ఒక్సానాను రెండు చేతులతో తనే ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన దుస్థితి భర్త విక్టర్‌ది. యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స చేసి వారి జీవితాలకు కొంతైనా సాంత్వన కల్పిద్దామని వెళ్లి.. రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయి దాదాపుగా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి సైన్యంలో పనిచేసే వైద్యుడు ఆంటోన్‌ గ్లాడున్‌ది. యుద్ధం తెచ్చిన సంక్షోభంతో ఆసుపత్రి మంచాలకే పరిమితమైన వీరందరూ చేసిన తప్పు ఏమిటి? వీరికెందుకీ శిక్ష? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులా? లేదా ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితా? యుద్ధాన్ని ఆపలేకపోయిన ప్రపంచమా? ఉక్రెయిన్‌లోని లివీవ్‌, చెర్కసీ నగరాల్లోని ఆసుపత్రుల్లో  కనిపించిన హృదయ విదారక దృశ్యాలివి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని