Updated : 23 May 2022 08:50 IST

డాన్‌బాస్‌పై రష్యా గర్జన

క్షిపణులతో దాడులు 

2,500 మంది ఉక్రెయిన్‌ సైనికులు తమ గుప్పిట్లో ఉన్నట్లు వెల్లడి

కీవ్‌: వారాల తరబడి పోరు సాగించిన తర్వాత మేరియుపొల్‌ నగరాన్ని చేజిక్కించుకున్న రష్యా సేనలు తమ తదుపరి లక్ష్యంగా పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను ఎంచుకున్నాయి. క్షిపణులు, ఫిరంగులతో విరుచుకుపడ్డాయి. తద్వారా గత ఎనిమిదేళ్లుగా తమ అనుకూలమైన వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని విస్తరించే ప్రయత్నం చేశాయి. దొనెట్స్క్‌ ప్రాంతంలోని స్లొవ్‌యాన్స్క్‌ దిశగా దాడుల్ని మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ప్రాంతంలోని ఒక చర్చిలో తలదాచుకున్నవారు లక్ష్యంగా పుతిన్‌ సేనలు దాడులకు దిగాయి. భవనం దెబ్బ తిన్నా, లోపల ఉన్నవారు ప్రాణాలతో బయటపడగలిగారు. డాన్‌బాస్‌లో పరిస్థితి క్లిష్టంగానే ఉందనీ, పూర్తిస్థాయి యుద్ధాన్ని దీటుగా మూడు నెలలుగా ఎదుర్కొంటూ రావడం మాత్రం శుభ పరిణామమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ‘ప్రతిరోజూ రష్యా దాడుల్ని మనవాళ్లు తిప్పికొడుతున్నారు. తద్వారా మనం కోరుకుంటున్న విజయ దినోత్సవానికి చేరువ కావడంలో అవిరళ కృషి సాగిస్తున్నారు. ఐరోపా సమాఖ్యలో చేరాలన్న మన అభ్యర్థనను ఈయూ సాధ్యమైనంత త్వరగా పరిశీలించాలి. అది కేవలం రాజకీయాల కోసం కాదు.. ఐరోపాలోని ఇతరులతో సమానమైన జీవితాల కోసం’ అని చెప్పారు.

రష్యా ఎప్పటికీ నెగ్గదు: పోలండ్‌

పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డుడా నేరుగా ఆకస్మికంగా కీవ్‌కు వచ్చి తమ దేశం తరఫున ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించారు. యుద్ధం ప్రారంభమయ్యాక తొలిసారి ఉక్రెయిన్‌ పార్లమెంటుకు వచ్చి ప్రసంగించిన విదేశీ నేత ఆయనే. సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని కరతాళ ధ్వనులతో ఆయనకు స్వాగతం పలికారు. ‘మీ పట్ల రష్యా ఎన్నో దారుణాలు చేసింది. ఎంతగానో నష్టం కలిగించింది. ప్రతిరోజూ మిమ్మల్ని బాధ పెడుతోంది. అయినా మిమ్మల్ని జయించలేకపోయింది. రష్యా ఎప్పటికీ మీపై విజయం సాధించదని నా ప్రగాఢ విశ్వాసం’ అని డుడా చెప్పారు. అజోవ్‌ రెజిమెంట్‌కు చెందిన 2,500 మంది తమవద్ద ఉన్నారని రష్యా తెలిపింది. వారిని యుద్ధ ఖైదీలుగా గుర్తించి, తిరిగి ఉక్రెయిన్‌కు పంపాలని కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు. పట్టుబడినవారంతా విచారణను ఎదుర్కోవాల్సిందేనని రష్యా అనుకూల నేత ఒకరు చెప్పారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని