Updated : 25 May 2022 10:12 IST

శ్రీలంకలో లీటరు పెట్రోలు రూ.420

డీజిల్‌ ధర రూ. 400, కి.మీ.కు ఆటోఛార్జి రూ. 90
ద్వీపదేశంలో చుక్కలు తాకుతున్న ఇంధన ధరలు

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా మంగళవారం లీటరు పెట్రోలు ధర 420 రూపాయలకు, డీజిల్‌ 400 రూపాయల (శ్రీలంక కరెన్సీలో)కు చేరింది. ఈమేరకు లీటరు పెట్రోలుపై ఒక్కసారిగా 82 రూపాయలు (24.3%), డీజిల్‌పై ఏకంగా 111 రూపాయలు (38.4%) పెంచుతూ సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరల పెంపుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు శ్రీలంక విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు. తదనుగుణంగా రవాణా, ఇతర సర్వీసు ఛార్జీలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆటోల నిర్వాహకులు కూడా ధరలు పెంచేశారు. తొలి కిలో మీటరుకు 90 రూపాయలు, రెండో కి.మీ. నుంచి 80 రూపాయలు వంతున పెంచుతున్నట్లు ప్రకటించారు.

చమురు అన్వేషణ దిశగా..

హిందూ మహాసాగరంలో భాగమైన లకాదీవ్‌ సముద్రంలోని మన్నార్‌ బేసిన్‌లో చమురు అన్వేషణపై అధ్యయనానికి శ్రీలంక ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ 5 లక్షల కోట్ల క్యుబిక్‌ అడుగుల మేర సహజ వాయువు ఉందని, ఇది ద్వీపదేశానికి వచ్చే 6 దశాబ్దాల పాటు ఇంధన అవసరాలను తీర్చగలదని స్థానిక మీడియా పేర్కొంది. 2011లో తొలిసారి ఇక్కడ సహజ వాయుక్షేత్రాన్ని కనుగొన్నారు. మన్నార్‌ బేసిన్‌లో చమురు అన్వేషణపై అధ్యయనానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి విజేశేఖర తెలిపారు.

భారత్‌ నుంచి 50 కోట్ల డాలర్ల రుణానికి..

పెట్రోలియమ్‌ ఉత్పత్తుల కొనుగోలుకు గాను ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 50 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 3,875 కోట్లు - భారత కరెన్సీలో) రుణం కోరేందుకు శ్రీలంక మంత్రివర్గం నిర్ణయించింది. దేశంలోని ఇంధన కేంద్రాల్లో నిల్వలు నిండుకోకుండా శ్రీలంక ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రుణం కోరేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రి విజేశేఖర మంగళవారం వెల్లడించారు. చమురు కొనుగోలుకు ఇప్పటికే ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి 50 కోట్ల డాలర్లు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 20 కోట్ల డాలర్ల రుణం పొందినట్లు చెప్పారు. జూన్‌ నుంచి మరో 53 కోట్ల డాలర్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు.

ద్రవ్యోల్బణం పైపైకి..

శ్రీలంకలో ద్రవ్యోల్బణం పైపైకి చేరుతూనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 33.8%కి చేరినట్లు జాతీయ వినియోగదారుల ధరల సూచి తెలుపుతోంది. గత ఏడాది ఇదే సమయం కంటే (5.5%) కంటే దాదాపు 6 రెట్లు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. తీవ్ర ఇంధన కొరత కూడా నెలకొంది.


శ్రీలంకకు యూఎస్‌ఏఐడీ అండ

వాషింగ్టన్‌: తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలకు అండగా నిలవడానికి కట్టుబడి ఉన్నట్లు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ) తెలిపింది. ఈమేరకు సంస్థ అడ్మినిస్ట్రేటర్‌ సమంతా పవర్‌ సోమవారం శ్రీలంక ప్రధాని విక్రమసింఘేతో ఫోనులో మాట్లాడారు. రాజకీయ అశాంతి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి ఆమె సానుభూతి తెలిపారు. శ్రీలంక ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే తక్షణం రాజకీయ, ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆమె సూచించారు. అత్యంత దుర్బల స్థితిలో ఉన్నవారికి, బడుగు వర్గాలకు అత్యవసర చేయూతనందించే కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, జీ7 తదితర సంస్థలు, కూటములతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని