China: మూల్యం చెల్లించుకోక తప్పదు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలోసీ తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్‌లో అడుగుపెట్టి, పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై చైనా మండిపడుతోంది. ‘ఏక చైనా విధానం’ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను

Updated : 04 Aug 2022 05:34 IST

పెలోసీ తైవాన్‌ పర్యటన నేపథ్యంలో అమెరికాను హెచ్చరించిన చైనా

బీజింగ్‌, జకార్తా: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలోసీ తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్‌లో అడుగుపెట్టి, పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై చైనా మండిపడుతోంది. ‘ఏక చైనా విధానం’ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అమెరికా, తైవాన్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని బుధవారం హెచ్చరించింది. స్వయంపాలిత ద్వీప ప్రాంతమైన తైవాన్‌ను తమ నుంచి విడిపోయిన ప్రావిన్సుగా భావిస్తున్న చైనా పునరేకీకరణకు బలప్రయోగానికి సైతం వెనుకాడబోమన్న వైఖరిని ప్రదర్శిస్తోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి తైవాన్‌ రాజధాని తైపీకి చేరుకున్న నాన్సి పెలోసీ (82) బుధవారం సాయంత్రం ఇక్కడి నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో ఇండో అమెరికన్‌ సభ్యుడైన రాజా కృష్ణమూర్తి కూడా ఉన్నారు. తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌ వెన్‌తో సమావేశమైన పెలోసీ ‘నేటి ప్రపంచం ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. తైవాన్‌తోపాటు ప్రపంచమంతటా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడాలన్నదే అమెరికా ఉక్కు సంకల్పం’ అని ప్రకటించారు. పెలోసీ బృందం ఈ దీవిలో ఉన్నపుడు చైనా ఆత్మరక్షణ పేరిట తైవాన్‌ చుట్టూ బలగాలను మోహరించింది. యుద్ధ విమానాలు సందడి చేశాయి. గురువారం నుంచి నాలుగు రోజులపాటు దీవి చుట్టూ సైనిక విన్యాసాల నిర్వహణకు సైతం బీజింగ్‌ సిద్ధమవుతోంది. మరోవైపు.. జకార్తా సమీపంలోని సుమత్రా దీవిలో అమెరికా, ఇండోనేసియా సైన్యాలు బుధవారం నుంచి వార్షిక సంయుక్త విన్యాసాలు ప్రారంభించడం గమనార్హం. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా, జపాన్‌, సింగపూర్‌ సేనలూ పాల్గొంటున్నాయి. 

దెబ్బతిన్న జిన్‌పింగ్‌ ప్రతిష్ఠ

మరికొద్ది నెలల్లో చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోవిడత ఎన్నికయ్యేందుకు సిద్ధమవుతున్న జిన్‌పింగ్‌ ప్రతిష్ఠను పెలోసీ పర్యటన దెబ్బతీస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఉప విదేశాంగ మంత్రి జీ ఫెంగ్‌ బీజింగులోని అమెరికా రాయబారి నికొలాస్‌ బర్న్స్‌ను మంగళవారం రాత్రికి రాత్రే పిలిపించి తైవాన్‌లో పెలోసీ పర్యటనపై తీవ్ర నిరసన తెలిపారు. తైవాన్‌ కార్డును అడ్డు పెట్టుకొని చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పారు. 


తైవాన్‌ చేపలు, సిట్రస్‌ పండ్లపై చైనా నిషేధం

తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలోసీ బృందం పర్యటనపై ఆగ్రహంగా ఉన్న చైనా ఆ ప్రాంతం నుంచి తాము దిగుమతి చేసుకొనే చేపలు.. ద్రాక్ష, నిమ్మ, నారింజ వంటి సిట్రస్‌ జాతి పండ్లపై బుధవారం నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు