విచారణకు హాజరైన ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ముందు విచారణకు హాజరయ్యారు. అధ్యక్షుడు అవకముందు ట్రంప్‌ తన గోల్ఫ్‌ కోర్సులు, బహుళ అంతస్తుల

Published : 11 Aug 2022 06:10 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ముందు విచారణకు హాజరయ్యారు. అధ్యక్షుడు అవకముందు ట్రంప్‌ తన గోల్ఫ్‌ కోర్సులు, బహుళ అంతస్తుల భవనాల విలువను ఎక్కువ చేసి చూపి రుణదాతలను, తక్కువగా చూపి పన్ను అధికారులను బురిడీ కొట్టించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటీషియా జేమ్స్‌ విచారణ జరుపుతున్నారు. లెటీషియా ప్రశ్నలకు జవాబివ్వకుండా తప్పించుకోవడానికి ట్రంప్‌ అమెరికా రాజ్యాంగంలోని అయిదో సవరణను ఉపయోగించుకున్నారు. అయితే రాజకీయ దురుద్దేశాలతోనే తన స్థిరాస్తి వ్యాపారాలపై విచారణ సాగుతోందని ఆయన ఆరోపించారు. తనపైన, తన కంపెనీ పైన అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయని వాపోయారు. అమెరికాను నిరంకుశ దేశాలతో పోలుస్తూ ‘బనానా రిపబ్లిక్‌’గా అభివర్ణించారు. ‘‘నేటి రాత్రి న్యూయార్క్‌ నగరంలో ఉన్నా. రేపు జాతివివక్షాపూరిత అటార్నీ జనరల్‌ ముందుకు వెళతా. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వేధింపును ఎదుర్కొంటున్నా’’ అని తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో మంగళవారం రాత్రి ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు.. ట్రంప్‌, ఆయన కంపెనీపై న్యాయపరంగా దావా వేయడానికి బలమైన సాక్ష్యాధారాలను సేకరించామని లెటీషియా జేమ్స్‌ కార్యాలయం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని