Published : 11 Aug 2022 05:38 IST

క్రిమియాలో రష్యాకు ఎదురుదెబ్బ!

 9 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయన్న ఉక్రెయిన్‌

కీవ్‌/రష్యా: ఉక్రెయిన్‌ నుంచి 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా ద్వీపంలో మంగళవారం జరిగిన భారీ పేలుళ్లు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ ఘటనలో సాకీ వైమానిక స్థావరంలోని 9 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్‌ పేర్కొంది. దీన్ని రష్యా ఖండించింది. ఒక్క విమానానికీ నష్టం జరగలేదని వివరణ ఇచ్చింది. మందుగుండు డిపోలో ప్రమాదం కారణంగా పేలుళ్లు సంభవించాయని, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయని, అంతకుమించి నష్టం వాటిల్లలేదని ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్‌ దాడుల కారణంగానే ఈ విమానాలు ధ్వంసమయ్యాయని వార్తలు వస్తున్నాయి. కీవ్‌ వర్గాలు మాత్రం.. ఈ ఘటనకు తమకు సంబంధం లేదని తెలిపాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమియాతోనే రష్యా ఆక్రమణ ప్రారంభమైందని, మళ్లీ ఆ ద్వీపాన్ని వశం చేసుకోవడంతోనే యుద్ధాన్ని అంతం చేస్తామని అన్నారు. 

పాత్రికేయురాలిపై రష్యా కఠిన చర్యలు

ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా బహిరంగంగా నిరసనలు తెలిపిన పాత్రికేయురాలు మరీనా ఒసియానాకోవాపై కఠినచర్యలు తీసుకోవటానికి రష్యా సిద్ధమైంది. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఛానల్‌ వన్‌లో మరీనా జర్నలిస్టుగా పనిచేసేవారు. గత నెల లైవ్‌ ప్రసారాలు జరుగుతుండగా యుద్ధం అన్యాయమంటూ ఆమె ప్లకార్డు పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఉద్యోగం పోయింది. ఆ తర్వాత కూడా మరీనా.. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమెపై రష్యా అధికారులు తాజాగా కన్నెర్ర చేశారు. యుద్ధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని మరీనాపై ప్రయోగించారు. దోషిగా తేలితే ఆమెకు పదిహేనేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని