ఏడుగురు తైవానీయులపై చైనా ఆంక్షలు

తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనతో అగ్గిమీద గుగ్గిలమైన చైనా.. అమెరికాకు చెందిన పాలక డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ఎడ్‌ మార్కీ నాయకత్వంలో అయిదుగురు సభ్యుల ప్రతినిధి వర్గం కూడా సోమవారం ఆ దీవికి రావడంపై

Published : 17 Aug 2022 05:59 IST

అమెరికా బృందం పర్యటనపై తీవ్ర ఆగ్రహం

బీజింగ్‌: తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనతో అగ్గిమీద గుగ్గిలమైన చైనా.. అమెరికాకు చెందిన పాలక డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ఎడ్‌ మార్కీ నాయకత్వంలో అయిదుగురు సభ్యుల ప్రతినిధి వర్గం కూడా సోమవారం ఆ దీవికి రావడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌కు చెందిన ఏడుగురు కీలక రాజకీయ నాయకులు, అధికారులపై మంగళవారం ఆంక్షలు విధించింది. వీరంతా ఒకే చైనా విధానాన్ని వ్యతిరేకిస్తూ తైవాన్‌ స్వతంత్ర దేశంగా నిలవాలని కోరుకుంటున్నవారు. త్వరలో మరింత మంది తైవానీయులపై ఆంక్షలు విధించనున్నట్లు చైనా తెలిపింది. తమ ఆంక్షలకు గురైనవారుకానీ, వారి కుటుంబసభ్యులుకానీ చైనా, హాంకాంగ్‌, మకావూలలో ప్రవేశించకూడదని బీజింగ్‌ స్పష్టం చేసింది. ఆంక్షలకు గురైనవారి కంపెనీలుకానీ, వారి ఆర్థిక వత్తాసుదారులుకానీ చైనాలో వ్యాపారాలు చేయకూడదు. ఈ ఆంక్షలు జీవితాంతం వర్తిస్తాయి. వీటికి గురైన ఏడుగురు తైవానీయులలో ఒకరు వాషింగ్టన్‌లో తైవాన్‌ అధికార ప్రతినిధి. జాబితాలోని ఆరుగురు ప్రస్తుతం తైవాన్‌ను పాలిస్తున్న డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ)కి చెందినవారే. ఈ పార్టీ తైవాన్‌ చైనాలో అంతర్భాగం కాదనీ, స్వతంత్ర దేశమనీ వాదిస్తోంది. ఆంక్షలకు గురైన ఏడో వ్యక్తి.. న్యూ పవర్‌ పార్టీ అధ్యక్షురాలు. గత డిసెంబరులో తైవాన్‌ ప్రధానమంత్రి సూ సెంగ్‌ చాంగ్‌, విదేశాంగ మంత్రి జోసెఫ్‌ వు, తైవాన్‌ లెజిస్లేచర్‌ అధ్యక్షుడు యూ సీ కున్‌లపై చైనా ఆంక్షలు విధించింది. తైవాన్‌కు, తమకు మధ్య ఉద్రిక్తతలు పెంచి, ప్రాంతీయంగా శాంతిభద్రతలకు భంగం కలిగించాలని అమెరికా పన్నాగం పన్నిందనీ, సోమవారంనాటి అమెరికా బృందం సందర్శనే దీనికి నిదర్శనమని చైనా సైన్య ప్రతినిధి వూ కియాన్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని