అణు కేంద్రం చుట్టూ ఆందోళన మేఘాలు

ఐరోపాలో అతిపెద్దదైన జపోరిజియా (ఉక్రెయిన్‌) అణు విద్యుత్‌ కేంద్రం చుట్టూ భయాందోళనలు ముసురుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ అణు కేంద్రం సమీపంలో

Updated : 28 Aug 2022 06:27 IST

కీవ్‌: ఐరోపాలో అతిపెద్దదైన జపోరిజియా (ఉక్రెయిన్‌) అణు విద్యుత్‌ కేంద్రం చుట్టూ భయాందోళనలు ముసురుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ అణు కేంద్రం సమీపంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం దీన్ని ఆయుధాలు నిల్వ చేయడానికి ఉపయోగించుకుంటూ రష్యా అక్కడి నుంచి తమపై దాడులు చేస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. మరోవైపు రష్యా కూడా.. ఈ అణు కేంద్రంపై ఉక్రెయిన్‌ విచ్చలవిడిగా కాల్పులకు దిగుతోందని ఆరోపణలు చేస్తోంది. అణు విద్యుత్‌ కేంద్రంలోని రియాక్టర్లకు నిరంతర శీతలీకరణ అవసరం. ఇది జరగాలంటే నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావాలి. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఫిరంగి గుళ్ల దాడిలో విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ తాత్కాలికంగా దెబ్బతినడంతో శీతలీకరణకు అంతరాయం ఏర్పడింది. ఇలా పదేపదే దాడులు జరిగితే శీతలీకరణ పనిచేయక అణు రియాక్టర్లు కరిగిపోయి రేడియో ధార్మిక కాలుష్యాన్ని వెదజల్లుతాయన్న భయాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని అధికారులు జపోరిజియా అణు కేంద్ర పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలకు అయోడిన్‌ మాత్రలు అందిస్తున్నారు. అవి రేడియో ధార్మికత నుంచి కొంతమేర రక్షణ కల్పిస్తాయి.

ముందుకొచ్చిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ

ఉక్రెయిన్‌పై దండెత్తిన వెంటనే రష్యా ఈ అణు కేంద్రాన్ని ఆక్రమించింది. దానిపై గుళ్ల వర్షానికి బాధ్యులు మీరంటే మీరు.. అంటూ రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. మరోవైపు జపోరిజియా అణు కేంద్రాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చేయడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు ఎప్పుడు వచ్చేదీ ఖరారు కాలేదు. కాగా జపోరిజియా అణు ప్లాంట్‌ను ఆక్రమించినందుకు.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశం రష్యాను తప్పుపట్టింది. దీనికి అభ్యంతరపెడుతూ ఎన్‌పీటీ సమావేశ తుది ముసాయిదా ఒప్పందం కుదరకుండా రష్యా అడ్డుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని