Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 9 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

Updated : 30 Apr 2024 16:46 IST

నారాయణ్‌పుర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్‌, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter)లో 9 మంది నక్సల్స్‌ హతమయ్యారు. 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరగడం ఇది రెండోసారి.

మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టి.. మంగళవారం ఉదయం నక్సల్స్‌ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు తొమ్మిది మందిని మట్టుబెట్టాయి. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరికొందరు నక్సల్స్‌ పరారయ్యారు.

‘పాకిస్థాన్‌కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్‌ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఏకే 47 తుపాకీ, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

ఇటీవల కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇక్కడ కాల్పుల్లో 29 మంది మరణించారు. వీరిలో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. తాజా ఘటనతో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్‌ అడవుల్లో దాదాపు 90 మంది నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది హతమార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని