జగన్‌ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం

‘సీఎం జగన్‌ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్‌ ప్రయత్నిస్తుంటారు.

Updated : 30 Apr 2024 09:49 IST

రాజధానిపై నియంతలా ఏకపక్ష నిర్ణయం
కేసుల నుంచి రక్షణకే ప్రత్యేక హోదాపై రాజీ
ఓటమి భయంతో కూటమి ఏర్పడకుండా ఎత్తులు
బెయిల్‌ కోసం తల్లిని, చెల్లిని రాయబారానికి పంపి.. సోనియాకు ఎదురు తిరిగిన వీరుడంటూ గొప్పలు
‘విధ్వంసం’ పుస్తక రచయిత ఆలపాటి సురేశ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ‘సీఎం జగన్‌ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్‌ ప్రయత్నిస్తుంటారు. కానీ అతనిలో తీవ్ర అభద్రతాభావం, భయం గూడుకట్టుకొని ఉన్నాయి. ఆయన సింహం కాదు, చిట్టెలుక. సింహం సింగిల్‌గా వస్తుందన్న సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి. నిజానికి అడవిలో ఏ సింహమూ సింగిల్‌గా ఉండదు. ఒక్కటే వేటాడదు. అవి గుంపులుగా ఉండి జంతువులను వేటాడి చంపుతాయి. జగన్‌తో కలిసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రానందునే వైకాపా ఒంటరిగా పోటీ చేస్తోంది. దీన్నే సింగిల్‌గా వస్తున్నామంటూ భ్రమ కల్పిస్తున్నారు’ అని ‘విధ్వంసం’ పుస్తక రచయిత ఆలపాటి సురేశ్‌కుమార్‌ విశ్లేషించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వివిధ వ్యవస్థలపై జరిగిన దాడిని వివరిస్తూ ఆయన ‘విధ్వంసం’ పేరిట పుస్తకం రాశారు. జగన్‌ పాలనా తీరుతెన్నులపై సురేశ్‌కుమార్‌ ఇటీవల విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. వివరాలు..

బెయిల్‌ కోసం రాయబారానికి వెళ్తే.. వీరుడా?

అవినీతి కేసుల్లో జగన్‌ను జైలుకు పంపితే.. ఎలాగైనా బెయిల్‌ వచ్చేలా చేసి, బయటకు తేవాలంటూ తల్లిని, చెల్లిని దిల్లీలోని సోనియా గాంధీ వద్దకు రాయబారానికి పంపారు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల ఇటీవల బయటపెట్టారు. ఇవన్నీ ప్రజలకు తెలియనప్పుడు ఆయన వీరుడు, శూరుడని ప్రచారం చేసుకుంటారు. సోనియాకే ఎదురొడ్డి నిలబడ్డారని గొప్పలు చెప్పారు. కానీ, నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్‌ ప్రో కో రూపంలో జగన్‌ అక్రమంగా సంపాదించినందునే సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయి. వాటిలో నిజాలు లేకపోతే ఆ కేసులు ఛార్జిషీట్ల వరకు ఎలా వస్తాయి? అన్ని కేసుల్లోనూ ఏ1 గా ఉన్న జగన్‌.. సహ నిందితులతో వేర్వేరుగా డిశ్చార్జి పిటిషన్లు వేయిస్తూ పదేళ్లకు పైగా లాక్కొచ్చారు. వీటిపై ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేరు కాబట్టే జగన్‌ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. సొంత మీడియా ఉందన్న ధీమాతో విలేకరుల సమావేశాలూ పెట్టలేదు.

వైకాపా స్వరం మారింది అప్పుడే..

తొలుత జనసేన, భాజపాతో జత కట్టాక వైకాపా ఎలాంటి విమర్శలూ చేయలేదు. ‘ఈసారి వైకాపా వ్యతిరేక ఓట్లు చీలనివ్వను’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన మరుక్షణమే వైకాపా నేతల దాడి మొదలైంది. ‘ఒంటరిగా బరిలోకి దిగు’ అంటూ పవన్‌ను రెచ్చగొట్టడం ప్రారంభించారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడితే తన గెలుపు కష్టమని తెలిసే వైకాపా పదేపదే పవన్‌పై విమర్శలు చేసింది. ఇది జగన్‌లో తీవ్రభయాన్ని సూచిస్తోంది. గత ఎన్నికలకు ముందు జగన్‌ తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారితో చెప్పించారు. గెలిచాక మూడు రాజధానుల నాటకమాడి నమ్మక ద్రోహం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం ఇప్పటికీ చర్చించలేదు. వాళ్లంటే భయం. అందుకే జగన్‌ రాజధాని గ్రామాల మీదుగా అసెంబ్లీకి వెళ్లేటప్పుడు ఇళ్ల ముందు పరదాలు కట్టిస్తున్నారు.

దోపిడీకి ముందస్తు ప్రణాళికలు

అధికారంలోకి వస్తే డబ్బు ఎలా పోగేయాలో జగన్‌ ముందుగానే మార్గాలు వెతుక్కున్నారు. ఇసుక మాఫియా గోల పడలేక చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తెచ్చారు. జగన్‌ ఆ విధానాన్ని మారుస్తున్నానంటూ దోపిడీకి వ్యూహం రచించి అమలు చేశారు. ఇసుకలో భయంకరమైన అక్రమార్జన జరిగింది. పర్యావరణం దెబ్బతింది. మద్యం పాలసీ అంతే. తెలంగాణలో ఉత్పత్తిదారు నుంచి ప్రభుత్వ రంగ సంస్థ మద్యాన్ని హోల్‌సేల్‌గా కొని, రిటైల్‌ వ్యాపారులకు అమ్ముతుంది. ఏపీలో మాత్రం టోకు, చిల్లర వ్యాపారం ప్రభుత్వమే చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తిదారులుగా అధికార పార్టీ నేతలే వ్యాపారంలోకి దిగారు. దేశమంతటా లభించే మద్యం బ్రాండ్లు ఏవీ రాష్ట్రంలోకి రానివ్వకుండా, పనికిరాని బ్రాండ్లను తయారుచేసి దోచేశారు. ఇసుక, మద్యం విక్రయాల్లో నగదు మాత్రమే తీసుకోవడం దోపిడీలో భాగమే.

అధికారులు ఎదురు చెప్పకూడదు

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా మన వ్యవస్థ వారికి రాజ్యాంగ రక్షణ కల్పించింది. కానీ జగన్‌ ఎక్కువ మంది అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారు. తన పాలనను గుడ్డిగా సమర్థించేలా చేసుకున్నారు. వైఎస్‌ హయాంలో జగన్‌ ఆర్థిక కుంభకోణాలకు సహకరించిన అధికారులను ఏపీకి తెచ్చుకొని, కీలక పోస్టుల్లో కూర్చోబెట్టారు. ఐదేళ్లలో ప్రతిపక్ష నేతలకు గత, ప్రస్తుత డీజీపీ ఒక్కసారీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటే ఎంత ఘోరమైన పరిస్థితో అర్థమవుతోంది. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టారు. అప్పట్లో కొవిడ్‌ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాయిదా వేస్తే, జగన్‌ ఆయన్ను కులం పేరుతో తిట్టిపోశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డను పంచాయతీరాజ్‌ చట్టసవరణ ద్వారా తప్పించారు. ఇది తప్పు అని అప్పటి సీఎస్‌ ఎందుకు చెప్పలేకపోయారు? చివరకు న్యాయస్థానం ముందు అభాసుపాలయ్యారు. మొత్తంగా ఐదేళ్లు అస్తవ్యస్త పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు.


మోదీకి ఎందుకు మోకరిల్లారు?

చంద్రబాబు ప్రత్యేక హోదా తేలేదని పలుమార్లు విమర్శించిన జగన్‌.. మరి ఐదేళ్ల పాలనలో తానెందుకు సాధించలేదో చెప్పరు. రాజ్యసభలో కీలక బిల్లులను దేశమంతా వ్యతిరేకించినా, జగన్‌ మద్దతిచ్చారు. ఆ సమయంలో తమ మద్దతు కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వండని మోదీకి ఎందుకు షరతు పెట్టలేదు? జగన్‌పై ఉన్న కేసులే ఇందుకు కారణం. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. జగన్‌ ఐదేళ్లూ విపరీతమైన అహంభావంతో నిరంకుశంగా పాలన సాగించారు. ఎవరి మాటా వినలేదు. నియంతలంతా పిరికివారని చరిత్ర చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని