Kolkata vs Delhi: సునీల్ నరైన్‌ను టీమ్‌ మీటింగ్‌లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్

 కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్‌ మీటింగ్‌ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు.  

Updated : 30 Apr 2024 11:09 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-17 సీజన్‌లో కోల్‌కతా రాణిస్తోంది. భారీ స్కోర్లు నమోదు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. సోమవారం దిల్లీపై 7 వికెట్ల తేడాతో నెగ్గి పాయింట్ల పట్టికలో ద్వితీయ స్థానాన్ని నిలబెట్టుకుంది. సునీల్ నరైన్ (Sunil Narine) (15) విఫలమైనా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (63; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ ఆటగాళ్ల బ్యాటింగ్ తీరు, టీమ్‌ మీటింగ్‌ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశాలను వివరించాడు. 

‘‘సన్నీ (సునీల్ నరైన్) టీమ్‌ మీటింగ్‌లకు రాడు. ఫిల్ సాల్ట్ మాత్రం వస్తాడు. అతడు పూర్తిగా ఆటలో నిమగ్నమై ఉన్నాడు. అతడు ఆడుతున్న తీరు చూస్తే ఎంతో ఆనందం కలుగుతోంది. ఇక నరైన్‌ అస్సలు టీమ్‌ మీటింగ్‌లకు హాజరుకాడు. నేను కూడా రావొద్దనే వాడిని. వరుణ్‌ చక్రవర్తి గత కొన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేం కోరుకునేది కూడా అదే’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. 

మా నిర్ణయం సరైందే.. కానీ: పంత్ 

కోల్‌కతాపై ఓటమి అనంతరం దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) మాట్లాడాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్న దిల్లీ.. క్రమంగా వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని పంత్ సమర్థించుకున్నాడు. ‘‘తొలుత బ్యాటింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయం సరైనదే. కానీ, మేం బాగా బ్యాటింగ్ చేయలేదు. మా తప్పుల నుంచి నేర్చుకుంటాం. ప్రతి రోజూ మనది కాదు. మేం చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచాం. మా బౌలర్లకు పోరాడటానికి అవసరమైనన్ని పరుగులు ఈ మ్యాచ్‌లో చేయలేదు’’ అని రిషభ్‌ పంత్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని