icon icon icon
icon icon icon

ఇక్కడ ఓటు అడగడానికి మీకెంత ధైర్యం రా?

వైకాపా పాలనలో ఐదేళ్లుగా అరాచక సామ్రాజ్యంగా మారిపోయిన చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు మరోసారి పేట్రేగిపోయారు.

Updated : 30 Apr 2024 09:45 IST

పెద్దిరెడ్డి స్వగ్రామంలోనే ప్రచారం చేస్తారా?
మంత్రి ఇలాకాలో రెచ్చిపోయి బీసీవైపీ కార్యకర్తలపై వైకాపా శ్రేణుల దాడి
రాళ్లు, కర్రలతో కార్లు, ప్రచార వాహనాల ధ్వంసం
పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌పై ఠాణాలో చేయి చేసుకునేందుకు యత్నం  
స్టేషన్‌ ఎదుటే ప్రచార వాహనాన్ని తగలబెట్టాలని విశ్వప్రయత్నం
 

ఈనాడు, చిత్తూరు: వైకాపా పాలనలో ఐదేళ్లుగా అరాచక సామ్రాజ్యంగా మారిపోయిన చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు మరోసారి పేట్రేగిపోయారు. ‘పెద్దిరెడ్డి స్వగ్రామంలోనే ప్రచారం చేస్తారా? ఇక్కడ ఓటు అడగడానికి మీకెంత ధైర్యం రా?’ అంటూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్‌ను దుర్భాషలాడుతూ.. దాడికి ప్రయత్నించారు. పోలీసుస్టేషన్‌లో ఆయనపైకి దండెత్తారు. వెంట వచ్చిన ప్రచార వాహనాలు, కార్లను స్టేషన్‌ ఎదుటే ధ్వంసం చేసి.. తగలబెట్టేశారు. సదుం పోలీసుస్టేషన్‌ ఆవరణలోకి వచ్చి ‘వాడిని (రామచంద్రయాదవ్‌ను) మాకు వదిలేయండి.. బుద్ధి చెబుతాం’ అంటూ బెదిరింపులకు దిగారు. ఇంత జరుగుతున్నా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు.

పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో ప్రచారం చేసేందుకు బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్‌, ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లారు. మంత్రి బంధువు పెద్దిరెడ్డి వేణుగోపాలరెడ్డి సోమవారం సాయంత్రం వారితో వాగ్వాదానికి దిగారు. ప్రచారానికి అనుమతి ఉందా అంటూ ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కార్లు, ప్రచార రథంపై రాళ్లతో విరుచుకుపడ్డారు. కొంతసేపటి తర్వాత రామచంద్ర యాదవ్‌, ఆయన అనుచరులు మండలంలోని గొడ్లవారిపల్లెకు చేరుకున్నారు. ఈలోపు విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు మరోసారి ప్రచార రథాలు, వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. 20 నిమిషాలపాటు వైకాపా కార్యకర్తలు రాళ్లవర్షం కురిపించారు. పోలీసులు వచ్చి రామచంద్ర యాదవ్‌ను సదుం స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తలలు పగలగొట్టి..: బీసీవైపీ అధినేత ఠాణాలో ఉన్నారని తెలుసుకుని 200 మందికిపైగా వైకాపా కార్యకర్తలు చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణలోకి వెళ్లి మరీ దాడిచేయాలని చూశారు. బయట ఉన్న కార్యకర్తలు కొందరు ప్రచార రథం జనరేటర్‌కు మంటపెట్టారు. పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికీ వైకాపా శ్రేణులు వెనక్కి తగ్గలేదు. పోలీసులూ అక్కడున్న వారిని చెదరగొట్టేందుకు యత్నించలేదు. దమనకాండను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లు అధికారపార్టీ కార్యకర్తలు లాక్కుని వీడియోలు డిలీట్‌ చేసి చితకబాదారు. జడ్పీ మాజీ వైస్‌ఛైర్మన్‌ అక్కడకు చేరుకుని వైకాపా కార్యకర్తలను వెనక్కి పంపారు. అనంతరం ఎస్పీ మణికంఠ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. యర్రాతివారిపల్లెలో ప్రచారానికి అనుమతులు తీసుకోలేదని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img