Elon Musk: 5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్‌ సంపద

Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్‌ డాలర్లు ఎగసింది.

Updated : 30 Apr 2024 11:49 IST

Elon Musk | ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో ఆయన వాటాల విలువ 37.3 బిలియన్‌ (దాదాపు రూ.3.11 లక్షల కోట్లు) డాలర్లు ఎగసింది. 2022 మార్చి తర్వాత ఒక వారం వ్యవధిలో ఆయన ఈ స్థాయిలో లబ్ధిపొందడం తొలిసారి. 2020, 2021లో భారీ పెరిగిన ఆయన సంపద ట్విటర్‌ కొనుగోలు తర్వాత ఒక దశలో క్రమంగా క్షీణించిన సంగతి తెలిసిందే.

సోమవారం టెస్లా షేర్లు భారీగా పుంజుకున్నాయి. చైనాలో ‘ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌’ సిస్టమ్‌ను అమలు చేసేందుకు సూత్రప్రాయ ఆమోదం లభించిందనే వార్తలు షేర్ల ర్యాలీకి దోహదం చేశాయి. అలాగే త్వరలో అందుబాటు ధరలో కారును తీసుకురానున్నామనే ప్రకటన కూడా దన్నుగా నిలిచింది. సోమవారం ఒక్క సెషన్‌లోనే మస్క్‌ (Elon Musk) సంపద 18.5 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలోని ఏ సంపన్నుడికైనా ఇది 13వ అతిపెద్ద మార్కెట్‌ ఆధారిత రోజువారీ లాభం. మస్క్‌ ప్రస్తుతం  202 బిలియన్‌ డాలర్లతో అత్యధిక సంపద కలిగిన మూడో వ్యక్తిగా కొనసాగుతున్నారు. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (217 బి.డా), జెఫ్‌ బెజోస్‌ (203 బి.డా) వరుసగా తొలి, ద్వితీయ స్థానంలో ఉన్నారు.

మస్క్‌ (Elon Musk) సంపదలో అత్యధిక భాగం టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ఎక్స్‌ షేర్ల రూపంలో ఉంది. తాజా ర్యాలీకి ముందు వరకు టెస్లా షేర్లు ఈ ఏడాది నష్టాల్లో కొనసాగుతూ వచ్చాయి. విక్రయాలు కుంగడం, ధరలు తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపింది. అయితే, స్పేస్‌ఎక్స్‌ వాటాలు మాత్రం 2022 మధ్య నుంచి 2023 పూర్తయ్యే నాటికి 40 శాతానికి పైగా పుంజుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని