గ్రహశకలాన్ని ఢీకొట్టిన డార్ట్‌

భూమి వైపునకు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాల బారి నుంచి జీవజాలాన్ని రక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇలాంటి రాకాసి శిలలను సురక్షితంగా దారిమళ్లించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా తొలిసారిగా

Updated : 28 Sep 2022 11:29 IST

 భూమిని రక్షించే దిశగా ముందడుగు

వాషింగ్టన్‌: భూమి వైపునకు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాల బారి నుంచి జీవజాలాన్ని రక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇలాంటి రాకాసి శిలలను సురక్షితంగా దారిమళ్లించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా తొలిసారిగా చేపట్టిన ప్రయోగం దిగ్విజయంగా సాగింది. ఈ సంస్థ పంపిన ‘డార్ట్‌ (డబుల్‌ ఆస్ట్రాయిడ్‌ రీడైరెక్ట్‌ టెస్ట్‌)’ వ్యోమనౌక అత్యంత కచ్చితత్వంతో డైమార్ఫస్‌ గ్రహశకలాన్ని ఢీ కొట్టింది.

భూమికి దాదాపు 1.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డిడిమోస్‌, డైమార్ఫస్‌ అనే జంట గ్రహశకలాల వద్దకు డార్ట్‌ వ్యోమనౌకను గత ఏడాది నవంబరులో నాసా ప్రయోగించిన సంగతి తెలిసిందే. 780 మీటర్ల వెడల్పున్న డిడిమోస్‌ చుట్టూ 170 మీటర్ల డైమార్ఫస్‌ తిరుగుతోంది. భూమికి చేరువలో ఉన్న గ్రహశకలాల్లో ప్రతి ఐదింట్లో ఒకటి ఇలాంటి జంట గ్రహశకల వ్యవస్థే. డైమార్ఫస్‌ను డార్ట్‌తో ఢీ కొట్టించాలన్నది నాసా లక్ష్యం. తద్వారా ఆ ఆస్ట్రాయిడ్‌ కక్ష్యలో ఎంతమేర మార్పు వస్తుందన్నది పరిశీలించాలని నిర్ణయించింది. దీని ఆధారంగా భవిష్యత్‌లో పుడమివైపు వచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే తీరుపై ఒక నిర్ధారణకు రావాలనుకుంది. ఈ విధానాన్ని ‘కైనెటిక్‌ ఇంపాక్ట్‌’గా పేర్కొంటారు.

రోదసిలో 10 నెలల పాటు ప్రయాణించిన డార్ట్‌.. మంగళవారం తెల్లవారుజామున జంట గ్రహశకలాల వ్యవస్థకు చేరువైంది. ఈ వ్యోమనౌకలోని ‘డిడిమోస్‌ రికానసెన్స్‌ అండ్‌ ఆస్ట్రాయిడ్‌ కెమెరా ఫర్‌ ఆప్టికల్‌ నేవిగేషన్‌’ (డ్రాకో) ఆ అంతరిక్ష శిలలను చిత్రీకరించి, భూమికి పంపింది. డార్ట్‌లోని మార్గనిర్దేశ, నియంత్రణ వ్యవస్థ.. ఈ పరికరంతో సమన్వయం చేసుకుంటూ రెండు గ్రహశకలాల్లోని తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో సొంతంగా గుర్తించింది. ఆ మేరకు డైమార్ఫస్‌ దిశగా డార్ట్‌ పయనం సాగింది. నాసా మిషన్‌ కంట్రోల్‌ కేంద్రంలో డ్రాకో దృశ్యాలను నాసా శాస్త్రవేత్తలు ఉత్కంఠగా వీక్షించారు. డైమార్ఫస్‌కు చేరువయ్యేకొద్దీ ఆ అంతరిక్ష శిలకు సంబంధించిన విస్పష్ట చిత్రాలు అందాయి.

భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటలకు డైమార్ఫస్‌ను గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో డార్ట్‌ ఢీకొట్టింది. దీనివల్ల ఆ వ్యోమనౌక విచ్ఛిన్నం కావడంతో ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది. అంతా అనుకున్నట్టే సాగడంతో నాసా శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

రెండు వారాల కిందట డార్ట్‌ నుంచి విడిపోయిన ‘లైట్‌ ఇటాలియన్‌ క్యూబ్‌శాట్‌ ఫర్‌ ఇమేజింగ్‌ ఆస్ట్రాయిడ్స్‌’ (లిసియాక్యూబ్‌) అనే బుల్లి ఉపగ్రహం.. డైమార్ఫస్‌ను ఢీకొన్న ప్రాంతాన్ని, అక్కడ రేగిన ధూళిని ఫొటో తీసి, భూమికి పంపనుంది. దాని ఆధారంగా డార్ట్‌ ఢీ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు అంచనావేయనున్నారు.

టెలిస్కోపులతో పరిశీలనలు.. 

డార్ట్‌ ఢీ వల్ల డైమార్ఫస్‌ పరిభ్రమణ కాలంలో 1 శాతం (10 నిమిషాలు) మేర తగ్గుదల నమోదు కావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా దాని కక్ష్యలో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. భూమి మీదున్న టెలిస్కోపుల సాయంతో పరిశీలించడం ద్వారా ఈ మార్పును నిర్ధారించనున్నారు. ఇందుకు కొన్ని వారాలు పడుతుంది. ఈ ప్రయోగం వల్ల మానవాళి లబ్ధి పొందుతుందని నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌ తెలిపారు. భూమిని రక్షించేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యంతో కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అంతరిక్షంలో ఒక చిన్న శిలనూ లక్ష్యంగా చేసుకోవచ్చని తాజా ప్రయోగం రుజువు చేసిందన్నారు. గ్రహశకలాలను ఎదుర్కొనే విషయంలో మానవాళి నిస్సహాయతను ఇది అధిగమిస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని