మాస్కోకు మరో వ్యూహాత్మక ఎదురుదెబ్బ

ఉక్రెయిన్‌తో యుద్ధంలో గత నెల నుంచి వరుస ఓటములు ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పుతిన్‌ దళాల అధీనంలోని ఖర్కీవ్‌లోని రెండో అతి పెద్ద నగరమైన లీమన్‌ను ఉక్రెయిన్‌ దళాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి.

Published : 02 Oct 2022 05:31 IST

లీమన్‌ నగరాన్ని చుట్టుముట్టిన ఉక్రెయిన్‌ దళాలు

పారిపోయిన పుతిన్‌ సేనలు

కీవ్‌: ఉక్రెయిన్‌తో యుద్ధంలో గత నెల నుంచి వరుస ఓటములు ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పుతిన్‌ దళాల అధీనంలోని ఖర్కీవ్‌లోని రెండో అతి పెద్ద నగరమైన లీమన్‌ను ఉక్రెయిన్‌ దళాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి మాస్కో తన దళాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది జెలెన్‌స్కీ సేనకు వ్యూహాత్మక విజయమని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా కూడా దీనిపై ప్రకటన చేసింది. తమ దళాలను.. ప్రత్యర్థులు చుట్టుముట్టలేదని.. వ్యూహాత్మకంగా అక్కడి నుంచి ఖాళీ చేశామని తెలిపింది. మరోవైపు కుపియాన్స్కీ జిల్లాలో పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న వాహనశ్రేణిపై మోర్టార్లతో దాడులు జరిపి, 20 మంది అమాయక పౌరుల ప్రాణాలను రష్యా బలిగొందని ఉక్రెయిన్‌ వర్గాలు ఆరోపించాయి.

‘జపొరీజియా’ అణువిద్యుత్కేంద్ర డైరెక్టర్‌ కిడ్నాప్‌
జపొరీజియా అణు విద్యుత్కేంద్ర డైరెక్టర్‌ మురషోవ్‌ను రష్యా దళాలు అపహరించాయని ఉక్రెయిన్‌ అణు సంస్థ ‘ఎనర్గో ఆటం’ తెలిపింది. శుక్రవారం తన నివాసం నుంచి కారులో విద్యుత్కేంద్రానికి  వెళుతున్న మురషోవ్‌ను అడ్డగించిన మాస్కో సైన్యం.. అతని కళ్లకు గంతలు కట్టి ఎత్తుకెళ్లారని పేర్కొంది. ఈ అపహరణతో ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.దీనిపై రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని