‘తెల్ల’జెండా ఎత్తిన జిన్‌పింగ్‌ సర్కారు

ఆరు నూరైనా ‘జీరో కొవిడ్‌’ విధానాన్ని అమలు చేసి తీరుతామని బెట్టు చూపిన చైనా ప్రజాందోళనలకు తలొగ్గక తప్పలేదు. కఠినమైన ప్రధాన కొవిడ్‌ ఆంక్షలు దాదాపు పదింటిని ఉపసంహరించుకొంటున్నట్లు బుధవారం ప్రకటించింది.

Published : 08 Dec 2022 05:32 IST

చైనాలో ‘జీరో కొవిడ్‌’ ఆంక్షల సడలింపు

బీజింగ్‌: ఆరు నూరైనా ‘జీరో కొవిడ్‌’ విధానాన్ని అమలు చేసి తీరుతామని బెట్టు చూపిన చైనా ప్రజాందోళనలకు తలొగ్గక తప్పలేదు. కఠినమైన ప్రధాన కొవిడ్‌ ఆంక్షలు దాదాపు పదింటిని ఉపసంహరించుకొంటున్నట్లు బుధవారం ప్రకటించింది. గత పది రోజులుగా గ్వాంగ్‌ఝూ, బీజింగ్‌ వంటి పలు నగరాల్లో జీరో కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు తెల్ల కాగితాలు చూపుతూ వినూత్న ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కమ్యూనిస్టు దేశంలో అసాధారణ రీతిలో అధ్యక్షుడి రాజీనామా కోరుతూ ఆందోళనకారులు ఉద్యమించిన విషయం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు జనసంచారాన్ని కట్టడి చేస్తూ దేశ ఆర్థికవ్యవస్థను శరవేగంగా దెబ్బతీసిన ‘జీరో కొవిడ్‌’ విధానానికి స్వస్తి పలికే దిశగా జిన్‌పింగ్‌ సర్కారు అడుగులు వేయక తప్పలేదు. మారుతున్న పరిస్థితులు, ఒమిక్రాన్‌ వేరియంట్‌ దుష్పరిణామాలు తగ్గుతున్న క్రమంలో కొవిడ్‌-19 కట్టడికి చైనా కేబినెట్‌ కొత్త నిబంధనలు రూపొందించినట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం రోజుకు 30 వేల దాకా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు ఉన్నపళంగా ఆంక్షలు సడలిస్తే ఒక్కసారిగా మళ్లీ పెరిగే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేసింది. మరోవైపు.. ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి శీతాకాలం అప్పుడే ప్రభావం చూపిస్తోంది.

* కొత్త విధానం ప్రకారం.. చైనా ప్రజలు ఇకపై తరచూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న కొవిడ్‌ బాధితులు ఇంట్లోనే ఏకాంతంలో గడపొచ్చు. గతంలో ఇటువంటి లక్షణాలు ఉన్నవారిని బలవంతంగా వైద్యశాలలకు తరలించేవారు. ఒక భవనంలో కొవిడ్‌ కేసు నమోదైతే ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్‌ చేసేవారు. ఇక ఆ విధానాలు అమలు చేయరు. అటువంటి భవనాల నుంచి బయటకు వెళ్లే మార్గాలను తెరిచే ఉంచుతారు. ఈ విషయాన్ని బీజింగ్‌లోని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది.

* చైనా అధికారిక గణాంకాల ప్రకారం.. 60 ఏళ్లు దాటినవారిలో 68.7% ప్రజలకు మూడు డోసుల టీకాలు పూర్తయ్యాయి. 80 ఏళ్లు దాటినవారిలో 40.4% ప్రజలు మాత్రమే బూస్టర్‌ డోసు పొందారు. చైనాలో చాలావరకు స్థానిక తయారీ వ్యాక్సిన్లనే వాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు