Insulin: వస్తోంది ఇన్సులిన్‌ మాత్ర..!

ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో తయారు చేయాలన్నది శాస్త్రవేత్తల వందేళ్ల కల! ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఈ కల నెరవేర్చే దిశగా ఓ పెద్ద ముందడుగు వేశారు.

Updated : 15 Dec 2022 07:40 IST

మెల్‌బోర్న్‌: ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో తయారు చేయాలన్నది శాస్త్రవేత్తల వందేళ్ల కల! ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఈ కల నెరవేర్చే దిశగా ఓ పెద్ద ముందడుగు వేశారు. టైప్‌-1 డయాబెటిస్‌ వ్యక్తులకు ఇచ్చే రోజువారీ ఇన్సులిన్‌ ఇంజెక్షన్లను భర్తీ చేయగల మాత్రల అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచారు. రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడానికి అవసరమైన కీలక హార్మోన్‌ ఇన్సులిన్‌. దీన్ని అనుకరించే ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్‌ అండ్‌ ఎలిజా హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు డాక్టర్‌ నికొలస్‌ కిర్క్‌, ప్రొఫెసర్‌ మైక్‌ లారెన్స్‌ కనుగొన్నారు. రక్తంలో గ్లూకోజ్‌ తీసుకొనే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ కొత్త పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘‘ఇన్సులిన్‌ను మాత్ర రూపంలో తయారు చేయడానికి శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇన్సులిన్‌ అస్థిరం. జీర్ణమైన తర్వాత శరీరంలో సులభంగా క్షీణిస్తుంది. అందుకే ఇన్సులిన్‌ను కనుగొని వందేళ్లయినా మాత్రను అభివృద్ధి చేయడం కలగానే మిగిలింది. పెద్దగా విజయం సాధించలేదు. ఇప్పుడు సైరో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ (సైరో ఈఎమ్‌) సాంకేతికతతో ఇన్సులిన్‌ను ప్రేరేపించే ఒక పెప్టైడ్‌ను గుర్తించాం. దీన్ని ఔషధంగా మార్చేందుకు సమయం పడుతుంది. ఇంకా చాలా పరిశోధన జరగాల్సి ఉంది. ఇది టైప్‌-1  మధుమేహులకు మాత్రల ద్వారా చికిత్స చేయాలనుకుంటున్న పరిశోధకులకు ఉత్తేజమిచ్చే ఆవిష్కరణ’’ అని డాక్టర్‌ కిర్క్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని