Hamas: ‘బందీలకు మత్తుమందు ఇచ్చి.. కృత్రిమ నవ్వులు తెప్పించి!’

బందీలు సంతోషంగా, ప్రశాంతంగా కనిపించేలా హమాస్‌ మిలిటెంట్లు వారికి మత్తుమందు ఇచ్చారని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ పేర్కొంది.

Published : 06 Dec 2023 02:06 IST

జెరూసలెం: హమాస్ (Hamas) చెరలో ఉన్న బందీలు ఇటీవల విడుదలైన సందర్భంలో మిలిటెంట్లకు నవ్వుతూ వీడ్కోలు చెబుతున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆ వీడియోలను చూస్తుంటే.. హమాస్ వారిని నిజంగా బాగా చూసుకుందా? అనే అభిప్రాయాలు రేకెత్తాయి. ఇదే విషయమై ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ (Israel Health Ministry) తాజాగా కీలక విషయం వెల్లడించింది. రెడ్‌క్రాస్‌కు అప్పగించే ముందు బందీలంతా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించేలా వారికి హమాస్‌ మిలిటెంట్లు మత్తుమందు ఇచ్చారని ఆరోగ్య శాఖ ప్రతినిధి ‘ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ హెల్త్‌ కమిటీ’కి చెప్పారు. బందీలు 50 రోజులకుపైగా ఎదుర్కొన్న శారీరక వేధింపులు, మానసిక భయాందోళనలను కప్పిపుచ్చేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.

హమాస్‌ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు..!

బందీలకు మత్తుమందులు ఇచ్చారనేదానికి బలం చేకూర్చే సాక్ష్యాలు, ఇతర వైద్య పరిశోధనల వివరాలతో కూడిన నివేదికను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలకు పంపాలని ‘ఆరోగ్య కమిటీ’ ఛైర్మన్‌.. సంబంధిత శాఖకు సూచించినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. అంతకుముందు.. బందీల తలపై హమాస్‌ మిలిటెంట్లు తుపాకీ గురిపెట్టి బలవంతంగా నవ్వుతూ, చేతులు ఊపేలా చేస్తున్నారంటూ ఇజ్రాయెల్‌ సైన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసి, సుమారు 240 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. హమాస్‌ ఉగ్రవాదుల వద్ద ఇంకా 137 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని