Sri Lanka Crisis: అట్టుడుకుతోన్న శ్రీలంక.. అండగా ఉంటామంటున్న భారత్‌

రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుపోయిన ద్వీపదేశం శ్రీలంకకు భారత్‌ అండగా నిలుస్తోంది. తమ పొరుగుదేశంలో ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, ఆర్థిక పునరుద్ధరణకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Published : 11 May 2022 02:10 IST

కొలంబో: రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుపోయిన ద్వీపదేశం శ్రీలంకకు భారత్‌ అండగా నిలుస్తోంది. తమ పొరుగుదేశంలో ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, ఆర్థిక పునరుద్ధరణకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం దిగిపోవాలంటూ చేస్తోన్న నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఆ ఘర్షణలకు తలొగ్గి మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై తాజాగా  విదేశాంగ శాఖ స్పందించింది. 

‘సన్నిహిత, చారిత్రక సంబంధాలు కలిగిన పొరుగుదేశంగా శ్రీలంకకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, ఆర్థిక పునరుద్ధరణకు అండగా నిలుస్తుంది. మా నైబర్‌హుడ్ ఫస్ట్ విధానానికి అనుగుణంగా ఈ ఒక్క ఏడాదిలోనే 3.5 బిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చింది. అత్యవసర సామాగ్రి కొరతను తగ్గించేందుకు భారతీయులు ఆహారం, ఔషధాలు ఇచ్చారు’ అంటూ విదేశాంగ శాఖ తెలిపింది. 

కాగా, దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలకు తలొగ్గి ప్రధాని రాజీనామా చేసినా.. అక్కడ నిరసన జ్వాలలు ఆగట్లేదు. నిన్న దేశవ్యాప్తంగా పలు చోట్ల మహీంద కేబినెట్‌ మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. కరునెగాలలోని మహీంద నివాసాన్నీ దహనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని