India: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాసలో భారత్‌ ఓటు..!

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాసలో భారత్‌ ఓటు వేసింది. హమాస్‌-ఇజ్రాయెల్‌ ఘర్షణ మొదలైన తర్వాత భారత్‌ తొలిసారి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా స్పందించింది.

Updated : 12 Nov 2023 11:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటువేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్‌ హైట్స్‌లో ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ (తమ దేశస్థులు సిర్థపడేట్లు చేయడం) కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థ వైఖరి తీసుకొన్నాయి. ఇక కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్‌, మార్షల్‌ఐలాండ్స్‌, ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి.

ఇటీవల ఇజ్రాయెల్‌-హమాస్‌ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. దీనిలో హమాస్‌ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్‌కు భారత్‌ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. 

పాలస్తీనా అధికారులు శుక్రవారం మాట్లాడుతూ హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. వారిలో దాదాపు 40శాతం మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆరోపించారు.

మరోవైపు హమాస్‌ ప్రధాన స్థావరంగా అనుమానిస్తున్న అల్‌-షిఫా ఆస్పత్రి వద్ద ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయితే, గాజా నుంచి సామాన్య పౌరులను తరలించేందుకు తాము సహకరిస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇప్పటికే అల్‌-షిఫా ఆస్పత్రిలోని పసిపిల్లలను తరలించేందుకు సాయం చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారీ వెల్లడించారు. ఆస్పత్రిలో ఇప్పటికే ఇంధనం పూర్తిగా అయిపోవడంతో ఇక్కడ క్షతగాత్రులకు చికిత్స చేయడం కష్టంగా మారింది. మరో ఆసుపత్రి అల్‌-ఖద్‌ దగ్గర కూడా పరిస్థితి భయానకంగానే ఉందని గాజా ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు ఆసుపత్రిని చుట్టుముట్టాయని.. ఇక్కడ 14 వేల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నాయి.

ఉత్తర గాజా నుంచి దక్షిణ ప్రాంతానికి ప్రజలు వలస వెళ్లేందుకు వీలుగా.. ఇజ్రాయెల్‌ కొన్ని గంటలపాటు ఫైరింగ్‌ను నిలిపివేసింది. ఇక విదేశీ పాస్‌పోర్టులు ఉన్న వారి కోసం ఈజిప్టు సరిహద్దులోని రఫా క్రాసింగ్‌ను ఆదివారం మరో సారి తెరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని