Israel: బ్యాగును ఆయుధంగా పొరపాటు పడి.. ఆ సిబ్బందిపై ఇజ్రాయెల్‌ దాడి

గాజాలో ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో ఆరుగురు సహాయక సిబ్బంది మృతి చెందారు. ఓ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును ఆయుధంగా పొరపాటు పడటం ఈ దాడికి కారణమైనట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

Published : 05 Apr 2024 19:47 IST

టెల్‌అవీవ్‌: ఇటీవల గాజా (Gaza)లో ఇజ్రాయెల్‌ (Israel) జరిపిన డ్రోన్‌ దాడిలో మానవతా సాయం అందిస్తోన్న సిబ్బంది సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనను అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. దీన్ని ఘోర తప్పిదంగా అంగీకరించిన ఇజ్రాయెల్‌.. తాజాగా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు సైన్యాధికారులను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. మరో ముగ్గురిని మందలించినట్లు తెలిపింది. విశ్రాంత జనరల్‌ నేతృత్వంలో చేపట్టిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పింది.

కీలక సమాచారాన్ని విశ్లేషించడంలో ఆ అధికారులు పొరపాటు చేశారని, మిలిటరీ నియమాలు ఉల్లంఘించారని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ‘‘ట్రక్కుల్లో కాకుండా కార్లలో వెళ్తున్నట్లు సహాయక సిబ్బంది పంపిన సందేశాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఆ వాహనాల్లో ఉగ్రవాదులు వెళ్తున్నట్లు తప్పుగా భావించారు. సైనిక నియమాల ప్రకారం.. దాడికి ముందు సంబంధిత లక్ష్యాలు దృశ్యపరంగా ముప్పుగా కనిపించాలి. అనేక కారణాలు దీనికి బలం చేకూర్చాలి. ఇక్కడ మాత్రం సహాయక సిబ్బంది కాన్వాయ్‌లో ఓ వ్యక్తి వద్ద ఆయుధం ఉన్నట్లు అస్పష్టమైన డ్రోన్‌ ఫుటేజీ ఆధారంగా ఓ మేజర్‌ గుర్తించాడు. ఆయన సూచన మేరకు ఓ కర్నల్‌ దాడులకు ఆదేశించాడు. అయితే.. ఆ మేజర్‌ పరిశీలన అవాస్తవమని దర్యాప్తులో తేలింది. బహుశా ఆ వ్యక్తి చేతిలో ఉన్నది బ్యాగ్‌ కావొచ్చు. మరోవైపు.. చీకటి పడినందున కార్లపై ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ పదాలను డ్రోన్‌ ఆపరేటర్లు గుర్తించలేకపోయారు’’ అని వివరించింది.

హెచ్చరించిన అమెరికా.. దిగొచ్చిన ఇజ్రాయెల్‌!

డ్రోన్‌ దాడిలో ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ స్వచ్ఛందసంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గాజాకు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తోన్న ఈ సంస్థ.. తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మృతుల్లో ముగ్గురు బ్రిటన్‌వాసులతోపాటు ఆస్ట్రేలియా, పోలండ్‌, అమెరికా, కెనడాకు చెందినవారున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో ఇప్పటివరకు 220 మంది సహాయక సిబ్బంది మృతి చెందినట్లు ఐరాస తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు