జపాన్‌లో జన సంక్షోభం.. రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు!

జపాన్‌లో జననాల రేటు 2022లో రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ఠానికి (1.26) పడిపోయింది. ప్రస్తుతం 12.5 కోట్లకుపైగా ఉన్న జపాన్ జనాభా.. 16 ఏళ్లుగా క్షీణిస్తూ వస్తోంది.

Published : 02 Jun 2023 23:07 IST

టోక్యో: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌ (Japan)లో జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశంలోని మహిళల సగటు సంతానోత్పత్తి రేటు వరుసగా ఏడో ఏడాదీ క్షీణించింది. 2022లో ఇది రికార్డు స్థాయిలో 1.26 కనిష్ఠానికి పడిపోయింది. జపాన్‌ ఆరోగ్యశాఖ తాజాగా ఈ వివరాలు వెల్లడించింది. 2022 జనాభా గణాంకాల ప్రకారం.. దేశంలో మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 1.26కు తగ్గిపోయింది. అంతకుముందు ఏడాది అది 1.30గా ఉండేది. దేశ జనాభా సమన్వయానికి అవసరమైన సంతానోత్పత్తి రేటు (2.06- 2.07) కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం 12.5 కోట్లకుపైగా ఉన్న జపాన్ జనాభా.. 16 ఏళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. 2070 నాటికి ఇది 8.7 కోట్లకు తగ్గుతుందని పలు నివేదికలు అంచనా వేశాయి.

జపాన్‌లో కొత్తగా జన్మించే వారి సంఖ్య గతేడాది కంటే 5 శాతం తగ్గి.. 7.77 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు ఒక ఏడాదిలో నమోదైన అత్యంత కనిష్ఠ జననాల సంఖ్య ఇదేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 9 శాతం పెరిగి 15.7 లక్షలుగా నమోదైంది. దీంతో ఒక ఏడాదిలో సుమారు 8 లక్షల జనాభా తగ్గింది. దేశ జనాభా క్షీణించడం ఇది వరుసగా 16వ ఏడాది కావడం గమనార్హం. మరోవైపు తగ్గిపోతున్న జనాభాతో దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతపై ప్రభావం పడుతుందని జపాన్‌ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే జననాలను ప్రోత్సహించే దిశగా కొత్త ‘చైల్డ్ కేర్ ప్యాకేజీ’ కోసం వచ్చే మూడేళ్లలో ఏడాదికి సుమారు 25.2 బిలియన్ డాలర్ల చొప్పున నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని