UNSC: అదో ‘పాత క్లబ్‌..!’ ఐరాస భద్రతా మండలిపై జైశంకర్‌ ఘాటు వ్యాఖ్యలు

ఐరాస భద్రతా మండలి ఓ ‘పాత క్లబ్‌’లాంటిదని, ఎక్కడ పట్టు కోల్పోతామేమోనని భావిస్తూ.. అందులోని సభ్య దేశాలు కొత్త సభ్యులను చేర్చుకోవడం లేదని విమర్శించారు.

Published : 17 Dec 2023 20:45 IST

బెంగళూరు: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC).. మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించడం లేదని భారత్‌ అనేక సందర్భాల్లో ఆక్షేపిస్తోంది. ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ‘యూఎన్‌ఎస్‌సీ’ని ఉద్దేశించి విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S.Jaishankar) ఘాటు వ్యాఖ్యలు చేశారు! ఐరాస భద్రతా మండలి ఓ ‘పాత క్లబ్‌ (Old Club)’లాంటిదని, ఎక్కడ పట్టు కోల్పోతామేమోనని భావిస్తూ.. అందులోని సభ్య దేశాలు కొత్త సభ్యులను చేర్చుకోవడం లేదని విమర్శించారు. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొని, ఈ మేరకు ప్రసంగించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకుగానూ ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని అనేక దేశాలు విజ్ఞప్తి చేస్తున్నట్లు జైశంకర్‌ తెలిపారు.

సొంత సైన్యం చేతిలో ‘ఇజ్రాయెల్‌ బందీలు’ మృతి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!

దశాబ్దాలుగా ఎటువంటి సంస్కరణలు చేపట్టకపోవడంతో ప్రపంచ వేదికపై ఐరాస ప్రభావం తగ్గిపోతోందని జైశంకర్‌ పేర్కొన్నారు. ‘‘ఐరాసలో ఒకవిధంగా మానవ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి ప్రపంచానికి హాని కలిగిస్తున్నాయి. ఎందుకంటే.. ప్రపంచం ఎదుర్కొంటోన్న కీలక సమస్యల విషయంలో ఐరాస ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటోంది’’ అని అన్నారు. ‘‘సభ్యదేశాలు యూఎన్‌ఎస్‌సీపై తమ నియంత్రణను కొనసాగించాలని భావిస్తాయి. మరింత మంది సభ్యులను చేర్చుకునే విషయంలో వాటికి ఆసక్తి లేదు. తమ కార్యకలాపాలను ఎవరైనా ప్రశ్నించడం అనేది వాటికి నచ్చదు’’ అని వ్యాఖ్యానించారు. ఐరాస భద్రతామండలిలో సంస్కరణలు కావాలా? వద్దా? అని 200 దేశాలను ప్రశ్నిస్తే.. చాలావరకు దేశాలు సానుకూలంగానే స్పందిస్తాయన్నారు.

‘ఆ రెండు వ్యవహారాలు వేర్వేరు..!’

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు సహకరిస్తామని భారత్‌ ఇప్పటికే వెల్లడించింది. కానీ, నిజ్జర్ హత్య కేసులో మాత్రం కెనడా దర్యాప్తునకు నిరాకరించింది. ఈ పరిణామాలపై జైశంకర్‌ స్పందిస్తూ.. ఈ రెండు వ్యవహారాలు ఒకే విధమైనవి కావని స్పష్టం చేశారు. అమెరికా తన కేసు విషయంలో సమాచారాన్ని పంచుకుందని గుర్తుచేశారు. భారత్‌ బాధ్యతాయుతమైన దేశమని పేర్కొంటూ.. ఏదైనా దేశానికి ఏ విషయంలోనైనా ఆందోళన ఉంటే, దానికి సంబంధించిన సరైన సమాచారం అందిస్తే పరిశీలించేందుకు సిద్ధమన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని