Crocodile Attack: మొసలి కళ్లలో పొడిచి.. ప్రాణాలతో బయటపడి!

నోటకరచుకుని నీట అడుగుభాగానికి లాక్కెళ్లిన మొసలి బారినుంచి ఓ వ్యక్తి చాకచక్యంగా బయటపడ్డారు. ఆ మకరం కళ్లలో పొడిచి తప్పించుకున్నాడు.

Published : 09 Apr 2023 19:12 IST

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా (Australia)లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. మొసలి నోట చిక్కిన ఓ వ్యక్తి.. చాకచక్యంతో దాని బారినుంచి తప్పించుకోవడం గమనార్హం. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. 44 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఇక్కడి క్వీన్స్‌లాండ్‌ (Queensland)లోని కూక్‌టౌన్‌ వద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు దిగాడు. ఈ క్రమంలోనే దాదాపు 4.5 మీటర్ల పొడవున్న ఓ మొసలి (Crocodile) తనను సమీపిస్తున్నట్లు గుర్తించాడు. ఈ క్రమంలోనే తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. అయితే, అతనిపై మూడు సార్లు దాడి(Crocodile Attack) చేసిన ఆ మకరం.. ఆపై నోటకరచుకుని నీటి అడుగు భాగానికి లాక్కెళ్లింది.

ఈ క్రమంలోనే చాకచక్యంగా వ్యవహరించిన ఆ బాధితుడు.. తన చేతి వేళ్లతో మొసలి కళ్లలో పొడిచాడు. దీంతో అది అతన్ని విడిచిపెట్టగా.. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో తీరానికి చేరుకున్నాడు. ఈ దాడిలో అతని తల, కాళ్లు, భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతానికి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. క్వీన్స్‌ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సైన్స్ గణాంకాల ప్రకారం.. 2020 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఇక్కడ మొత్తం ఎనిమిది మొసలి దాడులు జరగగా.. ఒకరు మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు