Mark Zuckerberg: సీక్రెట్‌ బంకర్‌ నిర్మించుకుంటోన్న జుకర్‌బర్గ్‌!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మార్క్‌ జుకర్‌బర్గ్‌.. హవాయి ద్వీపాల్లో భూమి కొనుగోలు చేశారట. అక్కడే ఓ విలసవంతమైన ఎస్టేట్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాడని సమాచారం.

Published : 06 Mar 2024 00:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెటా సీఈవో, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. హవాయి ద్వీపాల్లోని కవాయిలో కొంత భూమి కొనుగోలు చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేశారట. అక్కడే ఓ విలసవంతమైన ఎస్టేట్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాడని సమాచారం. ఇందులో ఓ రహస్య బంకర్‌ను (Secret Bunker) ఏర్పాటు చేసుకుంటున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హవాయి ద్వీపాల్లోని కువాయి ప్రాంతాల్లో దాదాపు 1400 ఎకరాల భూమిని జుకర్‌బర్గ్‌ కొనుగోలు చేశారు. ఇందులో దాదాపు 5వేల చదరపు అడుగుల్లో బంకర్‌ నిర్మిస్తున్నారు. విద్యుత్తు, ఆహారం వంటి సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇందుకోసం 260 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై జుకర్‌బర్గ్‌ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

‘వాటితో ఆయన ప్రాణాలకు ప్రమాదం’.. జుకర్‌బర్గ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌పై మెటా ఆందోళన

ఈ ప్రాజెక్టు విషయాలు బయటకు వెల్లడి కాకుండా జుకర్‌బర్గ్‌ జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన అనేక మంది సహచరులను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు అక్కడ పనిచేస్తోన్న కార్మికులు చెప్పారట. ఈ వివరాలను బయటకు వెల్లడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఫొటోలు తీసేందుకు కూడా కార్మికులు భయపడుతున్నట్లు సమాచారం.

కవాయి దీవి జనాభా సుమారు 73వేలు. స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతాన్ని ‘ది గార్డెన్‌ ఐల్‌’గా పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులకు ఈ ప్రదేశం వేదికగా నిలుస్తోంది. పైరేట్స్‌ ఆఫ్ ది కరేబియన్‌, జురాసిక్‌ పార్క్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలను ఇక్కడే తెరకెక్కించారు. ఈ ప్రదేశంలో ఆగస్టు 2014లోనే మార్క్‌ జుకర్‌బర్గ్‌ భూమి కొనుగోలు చేశారని వార్తా కథనాలు వెల్లడించాయి. 2016 క్రిస్మస్‌ హాలీడే సందర్భంగా కవాయిలో పర్యటించిన మార్క్‌.. కుటుంబంతో దిగిన కొన్ని ఫొటోలను పోస్టు చేసిన విషయాన్ని గుర్తుచేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని