Mark Zuckerberg: ‘వాటితో ఆయన ప్రాణాలకు ప్రమాదం’.. జుకర్‌బర్గ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌పై మెటా ఆందోళన

మార్షల్‌ ఆర్ట్స్‌తో జుకర్‌బర్గ్‌ ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 04 Feb 2024 11:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంపెనీ నిర్వహణ సీఈవోలకు కత్తి మీద సాములాంటిది. వారి చర్యలు సంస్థ ఉద్యోగులతోపాటు, కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వ్యక్తిగత అలవాట్ల నుంచి సంస్థ విధానపరమైన నిర్ణయాల వరకూ ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిందే. తాజాగా మెటా (Meta) సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) క్రీడాసక్తిపై కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌లో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్‌ (MMA)లో ఆయనకు గాయాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

‘‘జుకర్‌బర్గ్‌ సహా సంస్థలో ముఖ్యమైన సిబ్బంది పోరాట క్రీడల్లో పాల్గొంటున్నారు. వాటిని ఆస్వాదించే క్రమంలో ప్రమాదాలు జరిగితే.. కంపెనీ కార్యకలాపాలపై  ప్రభావం చూపిస్తుంది’’ అని ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌లో సంస్థ ప్రస్తావించింది. గతేడాది నవంబరులో మార్షల్‌ ఆర్ట్స్‌లో పాల్గొంటున్న సమయంలో తన మోకాలికి గాయమైందని.. శస్త్రచికిత్స చేయించుకున్నట్లు జుకర్‌బర్గ్‌ వెల్లడించారు.

యుద్ధ కళలో ఆయనకు ప్రావీణ్యం ఉందన్న సంగతి తెలిసిందే. గతేడాది జులైలో బ్రెజిలియన్‌ ‘జు జిట్సు’లో బ్లూ బెల్ట్‌ సాధించారు. అనంతరం తనతో  కేజ్‌ ఫైట్‌కు రావాలని టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) విసిరిన సవాల్‌ను స్వీకరించారు. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ విషయాన్ని మస్క్‌ తేలిగ్గా తీసుకున్నారని.. దీన్ని ఇక్కడితో వదిలేస్తానని మెటా బాస్‌ అప్పట్లో పేర్కొన్నారు.

బిల్‌గేట్స్‌ను దాటేసిన జుకర్‌బర్గ్‌

ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates)ను జుకర్‌బర్గ్‌ అధిగమించారు. శుక్రవారం కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల అనంతరం మెటా షేర్లు 20 శాతం పెరగడంతో, వాటి విలువ 28.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తంగా 170.5 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకారు. బిల్‌ గేట్స్‌ 165 బిలియన్‌ డాలర్ల సంపదతో తర్వాత స్థానంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని