Navalny: పుతిన్ ప్రత్యర్థి నావల్నీ.. ఎట్టకేలకు ఆచూకీ లభ్యం!

పుతిన్‌ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఆచూకీ లభ్యమైంది. ఆయన ప్రతినిధి కిరా యార్మిష్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Published : 25 Dec 2023 21:10 IST

మాస్కో: రష్యాలో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, పుతిన్‌ (Putin) విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) జైలు నుంచి అదృశ్యమైనట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో రష్యాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఈ పరిణామం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అయితే.. ఎట్టకేలకు నావల్నీ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతినిధి కిరా యార్మిష్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మాస్కోకు ఈశాన్యంగా 1,900 కి.మీల దూరంలో, యమల్‌- నెనెత్స్‌ రీజియన్‌లోని ఖార్ప్ పట్టణంలో ఉన్న పీనల్‌ కాలనీ (జైలు)లో నావల్నీని గుర్తించినట్లు ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

నావల్నీ.. జైలులో మిస్సింగ్‌..!

ఫౌండేషన్‌ కార్యకలాపాల విషయంలో నమోదైన కేసులో అలెక్సీ నావల్నీకి ఈ ఆగస్టులో 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. తర్వాత ఆయన్ను రష్యా రాజధాని మాస్కోకు 230 కి.మీల దూరంలో ఉన్న పీనల్ కాలనీ(జైలు)కి తరలించినట్లు సమాచారం. అయితే.. డిసెంబరు 6 నుంచి నావల్నీని తాము సంప్రదించలేకపోతున్నామని ఆయన తరఫు న్యాయవాదులు డిసెంబరు రెండో వారంలో వెల్లడించారు. ‘గత వారం ఆయన తన జైలుగదిలో అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచే కనిపించడం లేదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సైతం ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నడుమ మూడు వారాలకు ఆయన ఆచూకీ లభ్యమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని