North Korea: మరోసారి కవ్వించిన కిమ్‌.. రెండు బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగం..!

ఉత్తర కొరియా(North Korea) మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి రెండు బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది.

Updated : 18 Dec 2022 15:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా (North Korea) మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది. డిసెంబర్‌ నెలలో తొలిసారి రెండు బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. అమెరికా ప్రధాన భూభాగాలను లక్ష్యంగా చేసుకొనేందుకు వాడే క్షిపణిని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని పరీక్షలు అవసరమని రెండు రోజుల క్రితమే పేర్కొంది. తాజా క్షిపణి పరీక్షలను దక్షిణ కొరియా సైన్యం జాగ్రత్తగా గమనించింది. ఉ.కొరియా వాయువ్య ప్రాంతంలోని టాంగ్‌చాంగ్రి నుంచి 50 నిమిషాల వ్యవధిలో ఈ క్షిపణులను తూర్పు సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఇవి కొరియా-జపాన్‌ మధ్య సముద్ర జలాల్లో పడిపోయాయి. జపాన్‌ కోస్టుగార్డు సిబ్బంది ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

టాంగ్‌చాంగ్రిలో ఉత్తరకొరియా(North Korea)కు చెందిన సోహే శాటిలైట్‌ లాంఛింగ్‌ సెంటర్‌ ఉంది. గతంలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమైన రాకెట్లు ఇక్కడ పరీక్షించింది. దీనిపై అప్పట్లో ఐరాస మండిపడింది. రాకెట్ల ముసుగులో ఖండాంతర క్షిపణి టెక్నాలజీని పరీక్షిస్తోందని ఆరోపించింది. గురువారం ఇక్కడ అత్యంత శక్తిమంతమైన ఘన ఇంధన మోటార్‌ను ఉత్తరకొరియా(North Korea) ఇదే కేంద్రంలో పరీక్షించింది. దీనిని తమ వ్యూహాత్మక ఆయుధంలో ఉపయోగిస్తామని ఉత్తర కొరియా చెబుతోంది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగానే తాము క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తరకొరియా సమర్థించుకొంటోంది. తమ దేశాన్ని ఆక్రమించేందుకు ఆ విన్యాసాలు రిహార్సిల్స్‌ వంటివవని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని