Published : 20 Aug 2022 01:30 IST

37వేల అడుగుల ఎత్తులో విమానం.. నిద్రలో పైలట్లు‌.. తర్వాత ఏం జరిగిందంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా కాక్‌పిట్‌లో పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అలర్ట్‌ చేసినా గుర్తించలేనంత ఆదమరిచి నిద్రపోయారు. ఫలితంగా విమానం ల్యాండింగ్‌ మిస్సయ్యింది. దాదాపు 25 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికులను ప్రమాదంలో పడేసిన ఈ దిగ్భ్రాంతికర ఘటన ఈ నెల 15న ఇథియోపియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ బోయింగ్ విమానం ఆగస్టు 15వ తేదీన సూడాన్‌లోని ఖార్టూమ్‌ నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్‌ అబాబా బయల్దేరింది. మార్గమధ్యంలో పైలట్లు విమానాన్ని ఆటోపైలట్‌ మోడ్‌లో పెట్టి తాపీగా నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో విమానం 37వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈలోగా విమానం గమ్యస్థానానికి చేరుకుంది. అడ్డిస్ అబాబా ఎయిర్‌పోర్టులో విమానం దిగాల్సి ఉండగా... ఎంతసేపటికి ఆ ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) గుర్తించి పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించింది. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దాదాపు 25 నిమిషాల పాటు విమానం రన్‌వేపైనే గాల్లో చక్కర్లు కొట్టింది. ఆటోపైలట్‌ మోడ్ సెట్‌ చేసిన టైమర్‌ పూర్తవ్వడంతో డిస్‌కనెక్ట్‌ అయ్యింది. ఆ తర్వాత గట్టిగా అలారమ్‌ మోగడంతో పైలట్లు మేల్కొన్నారు. పొరబాటును గ్రహించి వెంటనే విమానాన్ని ల్యాండ్‌ చేశారు. అయితే అదృష్టవశాత్తూ విమానానికి ఎలాంటి హానీ కలగకుండా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఘటన సమయంలో విమానం ఎంతమంది ప్రయాణికులున్నారన్న వివరాలు తెలియరాలేదు.

ఈ ఘటనను ఏవియేషన్‌ నిఘా వ్యవస్థ ఏడీఎస్‌-బి ధ్రువీకరించింది. పైలట్లు నిద్రలో ఉండటంతో విమానం రన్‌వేపై గాల్లో చక్కర్లు కొట్టిందని పేర్కొంటూ అందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. అటు విమానయాన విశ్లేషకులు అలెక్స్‌ మాచెరాస్‌ కూడా ఈ దృశ్యాలను పోస్ట్‌ చేస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పైలట్ల అలసటే ఇందుకు కారణం కావొచ్చని, అయితే విమానయాన రంగానికి ఇది పెను సవాల్‌గా మారుతోందని అన్నారు.

ఈ ఏడాది మే నెలలోనూ ఫ్రాన్స్ గగనతలంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌ నుంచి రోమ్‌ వెళ్తోన్న ఓ విమానం 38వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్లు ఆటోపైలట్ మోడ్‌లో ఉంచి నిద్రపోయారు. దీంతో 10 నిమిషాల పాటు కమ్యూనికేషన్ ఆగిపోయింది. వారి నిర్వాకం కారణంగా ఫ్రాన్స్‌ అధికారులు ఉగ్రదాడి అలర్ట్‌ ప్రకటించారు. ఒక దశలో  రెండు ఫ్రెంచి జెట్‌ విమానాలు కూడా వీటిపై నిఘాకు పంపించారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని