Yevgeny Prigozhin: ‘మేం లొంగిపోం.. త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’: ప్రిగోజిన్ వ్యాఖ్యలు

వాగ్నర్ గ్రూప్(wagner group) తిరుగుబాటుతో రష్యా అధినాయకత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించినా.. ఆ గ్రూప్‌ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. 

Published : 24 Jun 2023 17:21 IST

మాస్కో: వాగ్నర్ గ్రూప్‌(wagner mercenary group) తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్(yevgeny Prigozhin) రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా మండిపడ్డారు. తమ విషయంలో పుతిన్ పొరబడ్డారని, తాము దేశభక్తులమని ప్రిగోజిన్‌ అన్నారు. అలాగే ఈ దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

‘మేం ఎవరికీ ద్రోహం చేయలేదు. అధ్యక్షుడు పొరబడ్డారు. మేం దేశభక్తులం. ఏ ఒక్కరూ కూడా లొంగిపోవడం లేదు. ఎందుకంటే మేం ఈ దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదు. పుతిన్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’అని పుతిన్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే వాగ్నర్ దళాలు రష్యా దక్షిణ ప్రాంత నగరాల నుంచి ముందుకు సాగుతున్నట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు. వారు ప్రయాణిస్తోన్న మోటార్ వే మాస్కో నగరాన్ని కలుపుతుంది. 

పుతిన్‌కు మద్దతుగా చెచెన్యా నేత..

చెచెన్యా నేత, క్రూరుడిగా పేరున్న రంజాన్‌ కదిరోవ్‌ (Ramzan Kadyrov)ప్రస్తుత తిరుగుబాటుపై ప్రకటన విడుదల చేశారు. ప్రిగోజిన్(yevgeny Prigozhin) చర్యలను ఖండించిన ఆయన.. రష్యాకు మద్దతు తెలిపారు. తాజా ఉద్రిక్తతలను తొలగించేందుకు సహకరిస్తానని వెల్లడించారు. ప్రిగోజిన్ తీరును వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. మరోపక్క..రష్యా పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న పొలండ్.. దేశంలో అత్యంత అప్రమత్తతను ప్రకటించింది. 

సొంత నగరంపైనే బాంబులు కురిపించిన రష్యా..

ఇన్నిరోజులు ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురిపించిన రష్యా.. ఇప్పుడు సొంత నగరంపైనే దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాగ్నర్‌ సేనలను నిలువరించేందుకు.. వొరొనెజ్‌లోని ఆయిల్ రిఫైనరీ, డిపోపై బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్‌కు రష్యా పార్లమెంట్ పూర్తి మద్దతు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు