
Prince Harry:బ్రిటన్ పర్యటనలో కుటుంబ భద్రత కోసం..యువరాజు హ్యారీ న్యాయపోరాటం
లండన్: అమెరికాకు చెందిన మాజీనటి మేఘన్ మార్కెల్‌ను పెళ్లాడి, బ్రిటన్ రాజరికాన్ని త్యజించిన యువరాజు హ్యారీ (37) మాతృదేశంలో తన కుటుంబ భద్రత కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఉంటున్న హ్యారీ కుటుంబం బ్రిటన్ పర్యటనకు వెళితే.. భద్రత మాటేమిటన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. రాజరికాన్ని వదులుకున్నాక గత రెండేళ్లలో హ్యారీ కుటుంబ సమేతంగా కాకుండా.. వ్యక్తిగత పర్యటన నిమిత్తం రెండుమార్లు బ్రిటన్‌కు వచ్చారు. గతేడాది ఏప్రిల్‌లో తాతయ్య ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు ఓమారు, తల్లి డయానా విగ్రహావిష్కరణకు జులైలో మరోమారు ఇంగ్లండ్ సందర్శించారు. జులై పర్యటనలో ఫొటోగ్రాఫర్ల కారు ప్రిన్స్ హ్యారీ కాన్వాయ్‌ను దాటుకొని పోవడం భద్రతపరంగా లోపమంటూ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భార్య మేఘన్ మార్కెల్, కుమారుడు ఆర్చీ (2), కుమార్తె లిలిబెత్ (ఏడు నెలలు)లతో బ్రిటన్‌లో పర్యటిస్తే భద్రత ఎలాగన్నది ఇపుడు న్యాయపోరాటం దాకా వెళ్లింది. రాజరికం వదులుకొన్న నేపథ్యంలో హ్యారీ కుటుంబం బ్రిటన్ పర్యటనకు వస్తే స్థానిక పోలీసు రక్షణ ఉండదని, ఖర్చు తనే భరించినా సాధ్యం కాదంటూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ప్రిన్స్ హ్యారీ కోర్టులో సవాలు చేస్తున్నారు. ‘యూకే ఎప్పటికీ ప్రిన్స్ హ్యారీ స్వస్థలమే. మాతృదేశంలో తన కుటుంబం క్షేమంగా ఉండాలని ఆయన కోరుకోవడం సబబే’ అని హ్యారీ న్యాయవాది ఓ ప్రకటనలో తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.