Putin: అదే జరిగితే అణు యుద్ధం తప్పదు.. అమెరికాకు పుతిన్‌ వార్నింగ్‌

ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని, అయితే అవి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలని పుతిన్‌ వ్యాఖ్యానించారు. 

Updated : 13 Mar 2024 16:10 IST

మాస్కో: ఉక్రెయిన్‌ (Ukraine)కు మద్దతుగా అమెరికా (USA) సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15-17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

‘‘సాంకేతికంగా అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ, అందుకు తొందరపడటం లేదు. మాకు కొన్ని విధివిధానాలున్నాయి. ఈ విషయం అమెరికాకు తెలుసు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే.. యుద్ధంలో ఆ దేశం నేరుగా జోక్యం చేసుకున్నట్లే. దానికి తప్పకుండా బదులిస్తాం. రష్యా-అమెరికా మధ్య సంబంధాలను వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు చాలామంది నిపుణులు ఉన్నారు’’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. 

ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే, ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలన్నారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు చేపడితే.. రష్యా కూడా వాటిని పరీక్షిస్తుందని పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన నాటినుంచి ఆ దేశానికి మద్దతుగా నాటో దేశాలు ఆయుధాలను అందిస్తున్నాయి. గత నెలలో ఉక్రెయిన్‌లో పాశ్చాత్య బలగాల మోహరింపు అంశాన్ని కొట్టిపారేయలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపై పుతిన్‌ పరోక్షంగా స్పందించారు. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని, ఈ యుద్ధంలో అతిగా జోక్యం చేసుకోవడం వంటి చర్యలు.. ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో నిండి ఉన్నాయని పశ్చిమదేశాలను ఆయన హెచ్చరించారు. తాజాగా మరోసారి ఇదే అంశంపై ఆయన స్పందించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో పుతిన్‌ విజయంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని