Grain Deal: పుతిన్‌- ఎర్డోగాన్‌ల భేటీ.. కొలిక్కిరాని ధాన్యం ఎగుమతుల వివాదం!

ధాన్యం ఎగుమతుల ఒప్పందంపై చర్చలకు సిద్ధమేనని రష్యా అధినేత పుతిన్‌ చెప్పారు. జులైలో ఈ ఒప్పందం నుంచి రష్యా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Published : 04 Sep 2023 20:23 IST

మాస్కో: నల్ల సముద్రం (Black Sea) మీదుగా ఆహార ధాన్యాల ఎగుమతులకు ఉక్రెయిన్, రష్యాల మధ్య కుదిరిన ‘ధాన్యం ఎగుమతుల ఒప్పందం (Grain Deal)’ జులైలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎగుమతుల విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు రష్యా పేర్కొంది. తాజాగా రష్యాలోని సోచి వేదికగా.. దేశాధినేత పుతిన్‌ (Putin), తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ల మధ్య జరిగిన భేటీ సందర్భంగా ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అయితే, ఈ వివాదం కొలిక్కి రాలేదు.

త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని సమావేశం అనంతరం ఎర్డోగాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం విషయంలో రష్యాపై ఉక్రెయిన్ తన కఠిన వైఖరిని కాస్త వీడాలని కోరారు. అంతకుముందు ‘ధాన్యం ఒప్పందం’పై రష్యా వైఖరిని పునరుద్ఘాటించిన పుతిన్‌.. ఈ అంశంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేరిన తర్వాత ఒప్పందంలో తిరిగి వచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. నల్ల సముద్రం కారిడార్లను సైనిక ప్రయోజనాలకు ఉపయోగించరాదని పేర్కొన్నారు.

ధాన్యం ఎగుమతుల ఒప్పందం.. రష్యా మరోసారి పేచీ!

గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు.. ఈ రెండు దేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. సమస్యకు పరిష్కారంగా గతేడాది జులైలో.. తుర్కియే, ఐరాస సమక్షంలో ఈ రెండు దేశాల మధ్య ‘ధాన్యం ఎగుమతుల ఒప్పందం’ కుదిరింది. అయితే.. గతేడాది నవంబరులో ఒకసారి, ఈ ఏడాది జులైలో మరోసారి రష్యా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌లో ధాన్యం రవాణాకు కీలకమైన ఒడెస్సా పోర్టులోని కీలక సదుపాయాలను ఇటీవల ధ్వంసం చేసింది. ఈ పరిణామాల నడుమ పుతిన్- ఎర్డోగాన్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు