Ukraine: ఉక్రెయిన్‌లో ఓడిపోతే పుతిన్‌ను హతమారుస్తారు: మస్క్‌

Ukraine: ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో వెనక్కి తగ్గొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి ఉన్నట్లు మస్క్‌ తెలిపారు. ఒకవేళ ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతే ఆయనని హతమారుస్తారని చెప్పారు.

Updated : 14 Feb 2024 10:07 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా (Russia Ukraine Conflict) ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. ఒకవేళ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారన్నారు. ఆ మేరకు ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ‘ఎక్స్‌’ స్పేసెస్‌ వేదికపై రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఆయన ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తనని చాలా మంది విమర్శిస్తున్నారని మస్క్‌ (Elon Musk) వాపోయారు. కానీ, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోయే అవకాశమే లేదన్నారు. ఇంకా ఉక్రెయిన్‌ గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం వారికే నష్టమన్నారు. అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. 

తనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ.. రష్యాను అణచివేయడానికి తమ కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదని మస్క్‌ (Elon Musk) అన్నారు. ఉక్రెయిన్‌కు స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ సేవలను అందిస్తోందని గుర్తుచేశారు. రష్యాకు వ్యతిరేకంగా కీవ్‌ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారిందన్నారు. రష్యా అంతరిక్ష వ్యాపారాల నుంచి స్పేస్‌ఎక్స్‌ దూరం జరిగిందని తెలిపారు. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు రష్యాలో పుతిన్‌ (Vladimir Putin)ను గద్దె దించాలనుకునేవారు ఆయన స్థానంలో ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. రాబోయేవారు శాంతికాముకులు అయ్యుంటారని ఎలా ఆశిస్తారన్నారు. వారు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదన్నారు.

ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌లకు 9,530 కోట్ల డాలర్ల సహాయం అందించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనెట్‌ మంగళవారం ఆమోదించింది. ఇందులో 6,000 కోట్ల డాలర్లను ఒక్క ఉక్రెయిన్‌కే ఇస్తారు. ఈ సహాయాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నందున బిల్లు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉంది. చివరకు 22 మంది రిపబ్లికన్లు పాలక డెమోక్రాట్లతో చేతులు కలపడంతో సెనెట్‌లో బిల్లు 70-29 ఓట్లతో నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని