Mexico: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేళ మెక్సికోలో తొలి రామమందిరం ప్రారంభం

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ మెక్సికోలో తొలి రామమందిరం ప్రారంభమైనట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Updated : 22 Jan 2024 19:55 IST

మెక్సికో: అయోధ్యలో బాలరాముడి (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ఠతో యావత్ భారతావని పులకించింది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని భారతీయులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెక్సికోలోని క్వెరెటారో నగరంలో ప్రవాస భారతీయులు తొలి రామమందిరాన్ని నిర్మించారు. భారత్‌ నుంచి తీసుకొచ్చిన సీతా సమేత శ్రీరాముడి విగ్రహాలను వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠించారు. ఈ క్రతువుకు అమెరికన్ పూజారిగా వ్యవహరించాడని భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు/వీడియోలను షేర్‌ చేసింది. 

‘‘మెక్సికోలోని క్వెరెటారో నగరంలో శ్రీరాముడి, హనుమంతుడి ఆలయాలను భారతీయులు నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు మెక్సికన్‌ అతిథులు ఆలపించిన భక్తి గీతాలతో ఆలయం దైవిక శక్తితో ప్రతిధ్వనించింది’’ అని రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శనివారం మెక్సికోలోని భారతీయులు భక్తి గీతాలు, భజనలు ఆలపించినట్లు తెలిపింది. రామాయణ గాథను వివరించే నృత్యరూపకాలు ప్రదర్శించడంతోపాటు, ‘లోక్‌ మే రామ్‌’ పేరుతో ప్రత్యేకంగా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని